పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఒకే ఒక్క టెస్టు... సొంతగడ్డపై తన చివరి టెస్టు మ్యాచ్ ఆడి రిటైర్ అవుతానని ప్రకటించిన వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ ఆశలను ఆ దేశ సెలక్టర్లు తుంచేశారు. భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన 13 మంది సభ్యుల జట్టులో గేల్‌కు చోటు దక్కలేదు. ఈ నెల 30 నుంచి జమైకాలోని కింగ్‌స్టన్‌లో భారత్, విండీస్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆడి నిష్క్రమించాలనే కోరికను గేల్ ప్రపంచ కప్ సమయంలో వెలిబుచ్చాడు.
అయితే ఐదేళ్ల క్రితం 2014లో తన చివరి టెస్టు ఆడిన గేల్‌ను ఇప్పుడు టెస్టు మ్యాచ్ కోసం పరిగణనలోకి తీసుకోవడం సరైంది కాదని రాబర్ట్ హేన్స్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావించింది. ‘గేల్ వన్డేలు, టి20ల్లో కొనసాగుతానంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. అతను ఆ ఫార్మాట్‌లలో ఇప్పటికీ విధ్వంసక బ్యాట్స్‌మన్. కానీ టెస్టు ఆడతానంటే మాత్రం కుదరదు. అతను ఐదేళ్లుగా టెస్టు బరిలోకి దిగలేదు. ఇప్పుడు ఒక్క మ్యాచ్ కోసం తీసుకురావడం అంటే మళ్లీ వెనక్కి వెళ్లినట్లే. యువ ఆటగాళ్లకు ఇది తప్పుడు సంకేతాలు ఇస్తుంది’ అని దిగ్గజ పేసర్ కర్ట్‌లీ ఆంబ్రోస్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా సెలక్టర్లను ప్రభావితం చేసి ఉండవచ్చు. విండీస్ తరఫున 103 టెస్టులు ఆడిన గేల్ 42.18 సగటుతో 7,214 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలు ఉండగా... అతని అత్యధిక స్కోరు 333 కావడం విశేషం.
అల్జారీ జోసెఫ్ ఔట్!
ఇంగ్లండ్‌తో తమ ఆఖరి టెస్టు సిరీస్ ఆడిన జట్టులో రెండు మార్పులతో వెస్టిండీస్ తమ టీమ్‌ను ప్రకటించింది. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతూ గాయపడిన అల్జారీ జోసెఫ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో అతడిని ఎంపిక చేయలేదు. లెఫ్టార్మ్ స్పిన్నర్ జోమెల్ వారికాన్ మాత్రం జట్టులో చోటు కోల్పోయాడు. వీరిద్దరి స్థానంలో విండీస్ ఒకే మార్పు చేసింది. ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ రహ్‌కీమ్ కార్న్‌వాల్‌ను తొలిసారి జట్టులోకి తీసుకుంది. తాజాగా భారత్‌తో ముగిసిన ‘ఎ’ సిరీస్‌లో రెండు టెస్టులు ఆడిన కార్న్‌వాల్ రెండు అర్ధసెంచరీలు చేసి 4 వికెట్లు పడగొట్టాడు. అటాకింగ్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో ధాటిగా ఆడగల సామర్థ్యం వల్ల కార్న్‌వాల్‌కు అవకాశం కల్పించినట్లు విండీస్ సెలక్టర్లు చెప్పారు. భారత్, విండీస్ మధ్య ఆగస్టు 22 నుంచి తొలి టెస్టు జరుగుతుంది.
విండీస్ టెస్టు జట్టు వివరాలు: జేసన్ హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రేవో, షమర్ బ్రూక్స్, జాన్ క్యాంప్‌బెల్, రోస్టన్ ఛేజ్, రహ్‌కీమ్ కార్న్‌వాల్, షేన్ డౌరిచ్, షనాన్ గాబ్రియెల్, షిమ్రాన్ హెట్‌మైర్, షై హోప్, కీమో పాల్, కీమర్ రోచ్.
Comments
Please login to add a commentAdd a comment