న్యూఢిల్లీ: కోవిడ్–19 వైరస్ గుప్పిట విలవిలలాడుతున్న చైనా దేశం రెజ్లర్లకు వీసాలిచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో నేటి నుంచి ఇక్కడ జరిగే ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ‘డ్రాగన్’ రెజ్లర్లు పాల్గొనడం లేదు. దీనిపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ మాట్లాడుతూ ‘ప్రాణాంతక వైరస్ వల్లే 40 మంది సభ్యుల చైనా రెజ్లింగ్ బృందానికి వీసాలు నిరాకరించినట్లు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం అర్థం చేసుకోగలం. ఇక్కడైనా ఎక్కడైనా ఆరోగ్యమే ప్రధానం’ అని అన్నారు. దీనిపై అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించగా... ‘ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. సాధారణ సమయంలో అయితే తీసుకుంటుందేమో కానీ ఇప్పుడైతే ప్రపంచాన్నే వణికించే వైరస్ అక్కడ విలయతాండవం చేస్తుంది. (ఇక్కడ చదవండి: కోవిడ్‌పై మరింత అప్రమత్తం )
కాబట్టి అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్యతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు’ అని ఆయన బదులిచ్చారు. భారత క్రీడల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ‘మేం ఎవరిపైనా వివక్ష చూపం. అయితే ప్రస్తుత పరిస్థితుల్ని పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోం’ అని అన్నారు. ప్రాణాంతక వైరస్ చైనాలోని ఉత్పాదక, పర్యాటక, సాంకేతిక రంగాలనే కాదు క్రీడారంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అక్కడ జరగాల్సిన మహిళల ఒలింపిక్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ ఈవెంట్, ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, ఫార్ములావన్ గ్రాండ్‌ప్రి, ఆసియా–ఓసియానియా ఒలింపిక్స్ బాక్సింగ్ క్వాలిఫయర్స్ టోర్నీల్లో కొన్ని రద్దు కాగా... మరికొన్నేమో వేరేచోటికి తరలివెళ్లాయి. చైనాలోని వుహాన్‌లో పుట్టుకొచ్చిన ఈ వైరస్ వల్ల ఇప్పటికే 1500 మందికి పైగా మృత్యువాత పడగా వేలమంది కోవిడ్–19 వైరస్ బారిన పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment