Wrestling Championships
-
ఇంట్లో తిని కూర్చొనే ఆ పిల్లాడే.. బరువు తగ్గేందుకు వెళ్లి.. ఇప్పుడిలా
సోనీపత్... అంటేనే గుర్తొచ్చేది రెజ్లర్లు. చిరాగ్ చికారా ఊరు కూడా సోనీపత్‌కు దగ్గర్లోనే ఉంది. ఆ పల్లెలో రెజ్లర్ల కార్ఖానా (అఖాడా)లు ఉన్నాయి. అక్కడి నుంచి కొందరు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. కానీ చిరాగ్‌కు రెజ్లర్ కావాలనే కలగానీ, స్పృహ గానీ ఏదీ లేదు. అనుకోకుండా వచ్చాడు. వచ్చాక కోచ్ మెచ్చేలా నడుచుకున్నాడు. దీంతో కోచ్‌కీ అంచనా వచ్చింది. ఇతను ఈ క్రీడలో పట్టుదలతో రాకపోయినా ‘ఓ పట్టు’ బడితే మాత్రం బరిలో విజేత అవుతాడని కోచ్ బలంగా నమ్మాడు. అలా కోచ్ దిద్దిన చాంపియన్‌గా చిరాగ్ చికారా విశ్వవిజేతగా అవతరించాడు. –సాక్షి క్రీడా విభాగం కెరీర్లోకి ఇష్టంగా రాకపోయినా... కష్టపడితే వచ్చే ఫలితమెంటో 18 ఏళ్ల టీనేజ్ రెజ్లర్ చిరాగ్ చికారా తన ‘పట్టు’లో చూపించాడు. అండర్–23 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత పురుష రెజ్లర్‌గా ఘనత వహించాడు. రెండేళ్ల ముందు అమన్ సెహ్రావత్ (2022) తొలి పసిడి పతకం అందించాడు. అయితే ఓవరాల్‌గా మాత్రం అతను మూడో భారత రెజ్లర్.మహిళల కేటగిరీలో గతేడాది రీతిక హుడా (76 కేజీలు) బంగారు పతకం అందించింది. ఊరిలోని అఖాడా ఓనమాలు నేర్పితే... సోనీపత్ అకాడమీలో కోచ్ కుల్దీప్ ప్రత్యేక చొరవ అతన్ని అండర్–23 వరల్డ్ చాంపియన్‌గా తయారు చేసింది. ఇదంతా కూడా ఆరేళ్లలోనే జరగడం విశేషం. జాతీయ స్థాయిలో పతకాలు గెలిచే క్రమంలో గాయాలు బాగా ఇబ్బంది పెట్టాయి. గత మూడేళ్లలో ఓసారి పక్కటెముకలకు, రెండుసార్లు మోకాళ్లకు గాయాలయ్యాయి. అయినా సరే బెదిరిపోలేదు. ఇష్టంలేని దానిపై ఎందుకీ కష్టాలు అనుకోలేదు. అంకితభావంతో కుస్తీ పట్టి ‘బంగారం’లాంటి విజయాన్ని సాధించాడు.ఇల్లు వీడని బాలుడే కుస్తీలో మొనగాడు ఇంటికే పరిమితమయ్యే బాలుడు చిరాగ్. ఎప్పుడు చూసిన ఇంట్లో తిని కూర్చొనే పిల్లాడు సహజంగానే లావుగా ఉంటాడు. దీంతో అతని తండ్రి దినేశ్ తనకి శారీరక శ్రమ అలవాటు చేయాలనే ఉద్దేశంతో 12 ఏళ్ల వయసులో ఊరిలో ఉన్న అఖాడాలో చేర్పించాడు. అక్కడికి అలవాటు పడ్డాక క్రమంగా ఆసక్తి పెరిగింది. అస్తమానం ఇంట్లోనే ఉండే ఆ కుర్రాడు అప్పుడు అఖాడా బాలుడయ్యాడు.పెరిగే వయసుతో పాటే మనసు లగ్నం చేయడంతో రెండేళ్లలో సబ్–జూనియర్ కేటగిరీలో భారత మేటి రెజ్లరయ్యాడు. ఇరాన్లో జరిగిన ఆసియా అండర్–15 చాంపియన్‌షిప్‌లో తలపడ్డాడు. ఆ తర్వాత 2021లో బుడాపెస్ట్‌లో జరిగిన క్యాడెట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాధించిన కాంస్యం అతన్ని రేసులో పడేసింది. ఇదంతా బాగానే ఉన్నా ఇంట్లోనే ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పెట్టేది.దినేశ్ చికారా చక్కెర మిల్లులో ఓ ఎలక్ట్రిషియన్. వచ్చే అరకొర జీతంతో అంతర్జాతీయ రెజ్లర్‌ను తయారు చేయడమంటే అఖాడాలో చేర్పించినంత సులువు కాదు. పెట్టాల్సిన భోజనం, పోషకాల ఆహారం తండ్రి దినేశ్‌కు కష్టమయ్యేది. కానీ తాత (దినేశ్ నాన్న రిటైర్డ్ టీచర్) రెజ్లర్ మనవడికి బలవర్ధకమైన పోషకాహారం ఒంటబట్టాలని తన పెన్షన్ డబ్బుల్ని కూడా ఇచ్చేవారు. కోచ్ కుల్దీప్ కీలకపాత్ర అలా ఇంటి నుంచి అందే సాయం, స్థానిక ఆఖాడా నుంచి సోనీపత్‌లోని రాయ్‌పూర్ రెజ్లింగ్ అకాడమీకి చేరేలా చేసింది. అక్కడ కోచ్ కుల్దీప్... చిరాగ్ నైపుణ్యాన్ని ఆరంభంలోనే గుర్తించాడు. చక్కగా సానబెట్టాలని, ప్రత్యర్థుల్ని పట్టుపట్టేందుకు అవసరమైన కిటుకులు నేర్పించాడు. ముందుగా గట్టిపోటీ భాగస్వాముల్ని ఎంపిక చేసి వారితోనే కుస్తీపడేలా ప్రణాళికను అమలుచేశాడు. జూనియర్ అయినప్పటికీ బలవంతులతో ఓడినా సరే వారితోనే పోరాటం అన్నట్లుగా కోచ్ ఇచ్చిన శిక్షణ చిరాగ్‌ను మార్చేసింది. తద్వారా చాలా మంది టాప్ స్టార్లను తయారు చేసిన ఈ రెజ్లింగ్ కార్ఖానా తాజాగా చిరాగ్ చికారాను చాంపియన్‌గా ఆవిర్భవించేలా చేసింది. అంతకుముందు ఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ విజేత రితిక (మహిళల 76 కేజీలు) కూడా రాయ్‌పూర్ అకాడమీ రెజ్లరే! గుర్తుంచుకో... ఇది 57 కేజీల కేటగిరీ! కోచ్ మార్గనిర్దేశనం పదేపదే లక్ష్యం ఎంత కఠినమైందో గుర్తుచేసేది. భారత్‌లో 57 కేజీల కేటగిరీకి ఉన్న పోటీ ఎలాంటిదో పదేపదే చెప్పేవాడు. ఒలింపిక్ పతక విజేతలు అమన్ సెహ్రావత్, రవి దహియాలు పోటీపడిన ఈవెంట్ కావడంతో చిరాగ్ ఓ మెట్టుపైనే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందని ఘంటాపథంగా చెప్పాడు. దీన్ని బాగా చెవికెక్కించుకున్న చిరాగ్ కష్టపడ్డాడు. చెమటోడ్చాడు. చివరకు అండర్–23 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అనుకున్నది సాధించాడు. ఇప్పుడు 57 కేజీల విశిష్టతను మరింత పెంచాడు.తన విజయంపై కోచ్ కుల్దీప్ మాట్లాడుతూ ‘ఈ పసిడి పతకం చిరాగ్ గొప్ప ముందడుగుకు శ్రీకారం చుడుతుంది. ప్రభుత్వ ఉద్యోగంతో ఉపాధి, స్పాన్సర్ల చేయూత ఇకపై లభిస్తాయి. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్స్) పథకానికి ఎంపికైతే విదేశీ శిక్షణ, ప్రఖ్యాత కోచ్‌ల మార్గదర్శనం అతన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుంది’ అని సంతోషం వెలిబుచ్చాడు. నిజానికి అతని నైపుణ్యానికి జూనియర్, జాతీయస్థాయిలో పతకాలెన్నో రావాలని... కానీ ఆశించినస్థాయిలో రాలేదన్నాడు. హరియాణా రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచినా జైపూర్‌లో జరిగిన సీనియర్ జాతీయ పోటీల్లో ఒక్క పతకం గెలవలేదన్నాడు. అయినాసరే నిరాశపడకుండా కష్టపడే తత్వమే చిరాగ్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని కోచ్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. -
‘హింద్ కేసరి’ అభిజీత్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ‘హింద్ కేసరి’ జాతీయ సీనియర్ ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్ అభిజీత్ కాట్కే చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం రాత్రి ఎల్బీ స్టేడియంలో జరిగిన పురుషుల ‘హింద్ కేసరి’ టైటిల్ బౌట్ ఫైనల్లో అభిజీత్ 5–0తో హరియాణాకు చెందిన సోమ్‌వీర్‌పై విజయం సాధించాడు. విజేత అభిజీత్ తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా మూడు కిలోల వెండి గదను అందుకున్నాడు. ఫైనల్స్‌కు ముఖ్య అతిథిగా హాజరైన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెజ్లింగ్ అకాడమీలను స్థాపించేందుకు ప్రయత్నిస్తామని, కుస్తీ క్రీడకు పూర్వ వైభవం లభించేలా కృషి చేస్తామని తెలిపారు. ‘మహిళా హింద్ కేసరి’ టైటిల్ హరియాణాకు చెందిన పుష్ప సొంతం చేసుకుంది. ఫైనల్లో పుష్ప ఢిల్లీకి చెందిన మోహినిపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. పుష్ప, మోహిని మధ్య జరిగిన టైటిల్ బౌట్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీక్షించారు. అనంతరం విజేత పుష్పను కవిత అభినందించారు. మెరిసిన తెలంగాణ రెజ్లర్లు... ‘హింద్ కేసరి’ టైటిల్ బౌట్స్ కాకుండా మిగతా వెయిట్ కేటగిరీలలో తెలంగాణ రెజ్లర్లు ఆకట్టుకున్నారు. మహిళల 62 కేజీల విభాగంలో సాహిర్ ఇబ్రహీమ్.. 48 కేజీల విభాగంలో బాలమణి.. 56 కేజీల విభాగంలో శ్రావణి తెలంగాణకు కాంస్య పతకాలు అందించారు. పురుషుల 60 కేజీల విభాగంలో తెలంగాణ రెజ్లర్లు నితీశ్, సయ్యద్ అబ్దుల్... 65 కేజీల విభాగంలో విజయ్ కుమార్... 70 కేజీల విభాగంలో దినేశ్, విజయ్... 75 కేజీల విభాగంలో హంజా బామస్, సయ్యద్ బిన్ అబ్దుల్లా... 80 కేజీల విభాగంలో సందీప్ యాదవ్ కాంస్య పతకాలు సాధించారు. -
చైనా రెజ్లర్లకు నో ఎంట్రీ
న్యూఢిల్లీ: కోవిడ్–19 వైరస్ గుప్పిట విలవిలలాడుతున్న చైనా దేశం రెజ్లర్లకు వీసాలిచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో నేటి నుంచి ఇక్కడ జరిగే ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ‘డ్రాగన్’ రెజ్లర్లు పాల్గొనడం లేదు. దీనిపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ మాట్లాడుతూ ‘ప్రాణాంతక వైరస్ వల్లే 40 మంది సభ్యుల చైనా రెజ్లింగ్ బృందానికి వీసాలు నిరాకరించినట్లు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం అర్థం చేసుకోగలం. ఇక్కడైనా ఎక్కడైనా ఆరోగ్యమే ప్రధానం’ అని అన్నారు. దీనిపై అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించగా... ‘ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. సాధారణ సమయంలో అయితే తీసుకుంటుందేమో కానీ ఇప్పుడైతే ప్రపంచాన్నే వణికించే వైరస్ అక్కడ విలయతాండవం చేస్తుంది. (ఇక్కడ చదవండి: కోవిడ్‌పై మరింత అప్రమత్తం ) కాబట్టి అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్యతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు’ అని ఆయన బదులిచ్చారు. భారత క్రీడల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ‘మేం ఎవరిపైనా వివక్ష చూపం. అయితే ప్రస్తుత పరిస్థితుల్ని పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోం’ అని అన్నారు. ప్రాణాంతక వైరస్ చైనాలోని ఉత్పాదక, పర్యాటక, సాంకేతిక రంగాలనే కాదు క్రీడారంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అక్కడ జరగాల్సిన మహిళల ఒలింపిక్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ ఈవెంట్, ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, ఫార్ములావన్ గ్రాండ్‌ప్రి, ఆసియా–ఓసియానియా ఒలింపిక్స్ బాక్సింగ్ క్వాలిఫయర్స్ టోర్నీల్లో కొన్ని రద్దు కాగా... మరికొన్నేమో వేరేచోటికి తరలివెళ్లాయి. చైనాలోని వుహాన్‌లో పుట్టుకొచ్చిన ఈ వైరస్ వల్ల ఇప్పటికే 1500 మందికి పైగా మృత్యువాత పడగా వేలమంది కోవిడ్–19 వైరస్ బారిన పడ్డారు. -
ప్రపంచ చాంపియన్‌షిప్: మెరిసిన ఫొగట్
నూర్ సుల్తాన్(కజికిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ మెరిశారు. మంగళవారం జరిగిన 53 కేజీల కేటగిరీ ఓపెనింగ్ రౌండ్లో వినేశ్ 12-0 తేడాతో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, స్వీడన్ రెజ్లర్ సోఫియా మాట్సన్‌పై ఘన విజయం సాధించారు. ఫలితంగా ప్రి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఎన్నో అంచనాలతో వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు సిద్ధమైన వినేశ్.. భారీ విజయంతో బోణి కొట్టారు. తొలుత 4-0 తేడాతో ఆధిక్య సాధించిన వినేశ్.. అదే జోరును కడవరకూ కొనసాగించారు. ఏ దశలోనూ సోఫియాకు అవకాశం ఇవ్వని వినేశ్.. చివరకు సోఫియాను మ్యాట్ నుంచి బయటకు నెట్టడంతో భారీ ఆధిక్యం సాధించారు. అయితే వినేశ్ గెలిచే క్రమంలో కాస్త నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోఫియాను మొత్తం మ్యాట్ నుంచి ఔట్ చేసిన సమయంలో వినేశ్ కాలు లైన్ లోపల ఉందా.. బయట ఉందా అనే దానిపై స్పష్టత రాలేదు. అదే సమయంలో సోఫియా చాలెంజ్‌కు వెళ్లడంతో రిఫరీలు పలు కోణాలు పరిశీలించి వినేశ్ కాలు లైన్ లోపలే ఉందని తేల్చారు. దాంతో వినేశ్ 12-0 తేడాతో గెలిచి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. తన తదుపరి రౌండ్లో వరల్డ్ చాంపియన్, జపాన్ రెజ్లర్ మయు ముకైదాతో వినేశ్ ఫొగట్ తలపడనున్నారు. -
అమిత్, విక్కీలకు రజతాలు
జియాన్ (చైనా): గత ఏడాది ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో కేవలం రెండు కాంస్య పతకాలు నెగ్గిన భారత రెజ్లర్లు ఈసారి మాత్రం అదరగొట్టారు. బుధవారం ముగిసిన ఫ్రీస్టయిల్ విభాగంలో రెండో రోజు భారత్‌కు రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలు లభించాయి. ఓవరాల్‌గా భారత్‌కు ఈ విభాగంలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు వచ్చాయి. ఫలితంగా భారత్ 155 పాయింట్లతో టీమ్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. 220 పాయింట్లతో ఇరాన్ ఓవరాల్ చాంపియన్ టైటిల్‌ను గెల్చుకుంది. బుధవారం జరిగిన ఐదు ఈవెంట్స్‌లో బరిలోకి దిగిన భారత రెజ్లర్లు పతకాలు నెగ్గడం విశేషం. అమిత్ ధన్కర్ (74 కేజీలు), విక్కీ (92 కేజీలు) రజత పతకాలు సొంతం చేసుకోగా... రాహుల్ అవారె (61 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు), సుమీత్ (125 కేజీలు) కాంస్య పతకాలను దక్కించుకున్నారు. 74 కేజీల ఫైనల్లో 2013 ఆసియా చాంపియన్ అమిత్ 0–5తో కైసనోవ్ దానియర్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ‘ఫైనల్లో ఓడినందుకు నిరాశగా ఉంది. అయితే తాజా ప్రదర్శన నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రాబోయే టోర్నీల్లో మరింత మెరుగ్గా రాణిస్తా. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తా’ అని అమిత్ అన్నాడు. 92 కేజీల ఫైనల్లో విక్కీ 0–11తో అలీరజా కరిమిమచియాని (ఇరాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. సెమీస్‌లో విక్కీ 3–2తో జియో సన్ (చైనా)పై గెలిచాడు. కాంస్య పతక బౌట్లలో రాహుల్ అవారె 9–2తో కిమ్ జిన్ చెయోల్ (కొరియా)పై, దీపక్ పూనియా 8–2తో కొదిరోవ్ బఖ్దుర్ (తజకిస్తాన్)పై, సుమీత్ 8–2తో అనకులోవ్ ఫర్ఖోద్ (తజికి స్తాన్)పై విజయం సాధించా రు. నేడు మహిళల ఫ్రీస్టయిల్ విభాగం పోటీలు మొదలవుతాయి. భారత్ తరఫున సీమా (50 కేజీలు), లలిత షెరావత్ (55 కేజీలు), మంజు (59 కేజీలు), దివ్య కక్రాన్ (68 కేజీలు), పూజా (76 కేజీలు) బరిలోకి దిగనున్నారు. -
రెజ్లర్ రవి కుమార్‌కు రజతం
ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రవి కుమార్ రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. రొమేనియాలోని బుకారెస్ట్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగం ఫైనల్లో రవి 0–6తో జపాన్‌కు చెందిన తొషిహిరో హసెగవా చేతిలో ఓడిపోయాడు. ఈ ఈవెంట్ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ రెజ్లర్‌గా రవి గుర్తింపు పొందాడు. 2017లో బజరంగ్ పూనియా (65 కేజీలు), ఓంప్రకాశ్ (70 కేజీలు) కూడా రజత పతకాలే సాధించారు. -
భారత రెజ్లర్లకు మూడు రజతాలు
ఆసియా జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఫ్రీస్టయిల్ పోటీల్లో విశాల్ కాళిరామన్ (70 కేజీలు), సచిన్ గిరి (79 కేజీలు), నవీన్ (57 కేజీలు) రజత పతకాలు గెలిచారు. ఫైనల్స్‌లో విశాల్ 7–10తో అమీర్ హుస్సేన్ (ఇరాన్) చేతిలో... సచిన్ 0–10తో సజ్జాద్ సాబిర్‌అలీ (ఇరాన్) చేతిలో... నవీన్ 1–7తో అబ్దుల్లాయేవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో కరణ్ 4–0తో పెర్మాన్ హోమదోవ్ (తుర్క్మెనిస్తాన్)పై గెలుపొందాడు. -
శ్రీకాంత్ ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్: సుభాష్ చంద్రబోస్, శివలాల్ ఎమ్మెల్యే రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పి. శ్రీకాంత్ ముందంజ వేశాడు. ధూల్‌పేట్‌లోని కులీ కుతుబ్‌షా మినీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ ఘనవిజయం సాధించాడు. 55కేజీల వెయిట్ కేటగిరీలో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ (గణేశ్వర్ ఉస్తాద్, కార్వాన్) 10–2తో ఎస్. చైతన్య కుమార్ (బాబయ్య ఉస్తాద్)పై విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో సి. విశ్వనాథ్ (మనోజ్ ఉస్తాద్) 8–2తో జి. అక్షయ్‌పై, జె. రాజు (ఆమ్లేపూర్) 8–2తో మోంటు (లక్ష్మీపతి వ్యాయామశాల)పై, శ్యామ్ సింగ్ (గోవింద్ రామ్ ఉస్తాద్) 10–4తో ఎస్. కరణ్ సింగ్ (రెస్లీ అకాడమీ)పై విజయం సాధించి ముందంజ వేశారు. -
బజరంగ్, వినోద్లకు రజతాలు
న్యూఢిల్లీ: ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు బజరంగ్ పూనియా (65 కేజీలు), వినోద్ కుమార్ (70 కేజీలు) రజత పతకాలు గెలిచారు. పోలాండ్‌లో ఆదివారం జరిగిన ఫ్రీస్టయిల్ ఫైనల్స్‌లో బజరంగ్ 7–16తో నచిన్ సెర్గీవిచ్ కులర్ (రష్యా) చేతిలో... వినోద్ 1–3తో రిచర్డ్ ఆంథోనీ లూయిస్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. సెమీఫైనల్స్‌లో బజరంగ్ 9–4తో అలీ అక్బర్ (ఇరాన్)పై, వినోద్ 2–1తో తొకోజిమా (జపాన్)పై గెలిచారు. -
రిక్త హస్తాలతో వెనక్కి...
పారిస్: భారీ అంచనాలతో ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత రెజ్లర్లు ఒక్క పతకం కూడా గెలవకుండానే వెనుదిరిగారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో చివరిరోజు బజరంగ్ (65 కేజీలు), అమిత్ ధన్కర్ (70 కేజీలు), ప్రవీణ్ రాణా (74 కేజీలు), సత్యవర్త్ (97 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయారు. ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లలో బజరంగ్ 5–6తో ఐకోబిష్విలి (జార్జియా) చేతిలో, ప్రవీణ్ రాణా 0–5తో హసనోవ్ (అజర్బైజాన్) చేతిలో, సత్యవర్త్ 0–5తో కెటోవ్ (అర్మేనియా) చేతిలో... అమిత్ తొలిరౌండ్లో 2–9తో తనతరోవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడారు. పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్, మహిళల ఫ్రీస్టయిల్ విభాగాల్లో కలిపి మొత్తం 24 మంది భారత రెజ్లర్లు బరిలోకి దిగగా... మహిళల 53 కేజీల విభాగంలో శీతల్ తోమర్ క్వార్టర్ ఫైనల్ చేరుకోవడమే భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన. మిగతా వారందరూ ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయారు.