ఇంట్లో తిని కూర్చొనే ఆ పిల్లాడే.. బరువు తగ్గేందుకు వెళ్లి.. ఇప్పుడిలా | Chirag Chikkara Who Started Wrestling To Shed Kilos Now Under 23 World Champion | Sakshi
Sakshi News home page

ఇంట్లో తిని కూర్చొనే ఆ పిల్లాడే.. బరువు తగ్గేందుకు వెళ్లి.. ఇప్పుడిలా

Published Tue, Oct 29 2024 6:11 PM | Last Updated on Tue, Oct 29 2024 6:54 PM

Chirag Chikkara Who Started Wrestling To Shed Kilos Now Under 23 World Champion

సోనీపత్‌... అంటేనే గుర్తొచ్చేది రెజ్లర్లు. చిరాగ్‌ చికారా ఊరు కూడా సోనీపత్‌కు దగ్గర్లోనే ఉంది. ఆ పల్లెలో రెజ్లర్ల కార్ఖానా (అఖాడా)లు ఉన్నాయి. అక్కడి నుంచి కొందరు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. కానీ చిరాగ్‌కు రెజ్లర్‌ కావాలనే కలగానీ, స్పృహ గానీ ఏదీ లేదు. 

అనుకోకుండా వచ్చాడు. వచ్చాక కోచ్‌ మెచ్చేలా నడుచుకున్నాడు. దీంతో కోచ్‌కీ అంచనా వచ్చింది. ఇతను ఈ క్రీడలో పట్టుదలతో రాకపోయినా ‘ఓ పట్టు’ బడితే మాత్రం బరిలో విజేత అవుతాడని కోచ్‌ బలంగా నమ్మాడు. అలా కోచ్‌ దిద్దిన చాంపియన్‌గా చిరాగ్‌ చికారా విశ్వవిజేతగా అవతరించాడు.    –సాక్షి క్రీడా విభాగం  

కెరీర్‌లోకి ఇష్టంగా రాకపోయినా... కష్టపడితే వచ్చే ఫలితమెంటో 18 ఏళ్ల టీనేజ్‌ రెజ్లర్‌ చిరాగ్‌ చికారా తన ‘పట్టు’లో చూపించాడు. అండర్‌–23 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత పురుష రెజ్లర్‌గా ఘనత వహించాడు. రెండేళ్ల ముందు అమన్‌ సెహ్రావత్‌ (2022) తొలి పసిడి పతకం అందించాడు. అయితే ఓవరాల్‌గా మాత్రం అతను మూడో భారత రెజ్లర్‌.

మహిళల కేటగిరీలో గతేడాది రీతిక హుడా (76 కేజీలు) బంగారు పతకం అందించింది. ఊరిలోని అఖాడా ఓనమాలు నేర్పితే... సోనీపత్‌ అకాడమీలో కోచ్‌ కుల్దీప్‌ ప్రత్యేక చొరవ అతన్ని అండర్‌–23 వరల్డ్‌ చాంపియన్‌గా తయారు చేసింది. ఇదంతా కూడా ఆరేళ్లలోనే జరగడం విశేషం. 

జాతీయ స్థాయిలో పతకాలు గెలిచే క్రమంలో గాయాలు బాగా ఇబ్బంది పెట్టాయి. గత మూడేళ్లలో ఓసారి పక్కటెముకలకు, రెండుసార్లు మోకాళ్లకు గాయాలయ్యాయి. అయినా సరే బెదిరిపోలేదు. ఇష్టంలేని దానిపై ఎందుకీ కష్టాలు అనుకోలేదు. అంకితభావంతో కుస్తీ పట్టి ‘బంగారం’లాంటి విజయాన్ని సాధించాడు.

ఇల్లు వీడని బాలుడే కుస్తీలో మొనగాడు 
ఇంటికే పరిమితమయ్యే బాలుడు చిరాగ్‌. ఎప్పుడు చూసిన ఇంట్లో తిని కూర్చొనే పిల్లాడు సహజంగానే లావుగా ఉంటాడు. దీంతో అతని తండ్రి దినేశ్‌ తనకి శారీరక శ్రమ అలవాటు చేయాలనే ఉద్దేశంతో 12 ఏళ్ల వయసులో ఊరిలో ఉన్న అఖాడాలో చేర్పించాడు. అక్కడికి అలవాటు పడ్డాక క్రమంగా ఆసక్తి పెరిగింది. అస్తమానం ఇంట్లోనే ఉండే ఆ కుర్రాడు అప్పుడు అఖాడా బాలుడయ్యాడు.

పెరిగే వయసుతో పాటే మనసు లగ్నం చేయడంతో రెండేళ్లలో సబ్‌–జూనియర్‌ కేటగిరీలో భారత మేటి రెజ్లరయ్యాడు. ఇరాన్‌లో జరిగిన ఆసియా అండర్‌–15 చాంపియన్‌షిప్‌లో తలపడ్డాడు. ఆ తర్వాత 2021లో బుడాపెస్ట్‌లో జరిగిన క్యాడెట్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాధించిన కాంస్యం అతన్ని రేసులో పడేసింది. ఇదంతా బాగానే ఉన్నా ఇంట్లోనే ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పెట్టేది.

దినేశ్‌ చికారా చక్కెర మిల్లులో ఓ ఎలక్ట్రిషియన్‌. వచ్చే అరకొర జీతంతో అంతర్జాతీయ రెజ్లర్‌ను తయారు చేయడమంటే అఖాడాలో చేర్పించినంత సులువు కాదు. పెట్టాల్సిన భోజనం, పోషకాల ఆహారం తండ్రి దినేశ్‌కు కష్టమయ్యేది. కానీ తాత (దినేశ్‌ నాన్న రిటైర్డ్‌ టీచర్‌) రెజ్లర్‌ మనవడికి బలవర్ధకమైన పోషకాహారం ఒంటబట్టాలని తన పెన్షన్‌ డబ్బుల్ని కూడా ఇచ్చేవారు.  

కోచ్‌ కుల్దీప్‌ కీలకపాత్ర 
అలా ఇంటి నుంచి అందే సాయం, స్థానిక ఆఖాడా నుంచి సోనీపత్‌లోని రాయ్‌పూర్‌ రెజ్లింగ్‌ అకాడమీకి చేరేలా చేసింది. అక్కడ కోచ్‌ కుల్దీప్‌... చిరాగ్‌ నైపుణ్యాన్ని ఆరంభంలోనే గుర్తించాడు. చక్కగా సానబెట్టాలని, ప్రత్యర్థుల్ని పట్టుపట్టేందుకు అవసరమైన కిటుకులు నేర్పించాడు. ముందుగా గట్టిపోటీ భాగస్వాముల్ని ఎంపిక చేసి వారితోనే కుస్తీపడేలా ప్రణాళికను అమలుచేశాడు. 

జూనియర్‌ అయినప్పటికీ బలవంతులతో ఓడినా సరే వారితోనే పోరాటం అన్నట్లుగా కోచ్‌  ఇచ్చిన శిక్షణ చిరాగ్‌ను మార్చేసింది. తద్వారా చాలా మంది టాప్‌ స్టార్లను తయారు చేసిన ఈ రెజ్లింగ్‌ కార్ఖానా తాజాగా చిరాగ్‌ చికారాను చాంపియన్‌గా ఆవిర్భవించేలా చేసింది. అంతకుముందు ఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌ విజేత రితిక (మహిళల 76 కేజీలు) కూడా రాయ్‌పూర్‌ అకాడమీ రెజ్లరే!  

గుర్తుంచుకో... ఇది 57 కేజీల కేటగిరీ! 
కోచ్‌ మార్గనిర్దేశనం పదేపదే లక్ష్యం ఎంత కఠినమైందో గుర్తుచేసేది. భారత్‌లో 57 కేజీల కేటగిరీకి ఉన్న పోటీ ఎలాంటిదో పదేపదే చెప్పేవాడు. ఒలింపిక్‌ పతక విజేతలు అమన్‌ సెహ్రావత్, రవి దహియాలు పోటీపడిన ఈవెంట్‌ కావడంతో చిరాగ్‌ ఓ మెట్టుపైనే ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుందని ఘంటాపథంగా చెప్పాడు. దీన్ని బాగా చెవికెక్కించుకున్న చిరాగ్‌ కష్టపడ్డాడు. చెమటోడ్చాడు. చివరకు అండర్‌–23 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అనుకున్నది సాధించాడు. ఇప్పుడు 57 కేజీల విశిష్టతను మరింత పెంచాడు.

తన విజయంపై కోచ్‌ కుల్దీప్‌ మాట్లాడుతూ ‘ఈ పసిడి పతకం చిరాగ్‌ గొప్ప ముందడుగుకు శ్రీకారం చుడుతుంది. ప్రభుత్వ ఉద్యోగంతో ఉపాధి, స్పాన్సర్ల చేయూత ఇకపై లభిస్తాయి. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం (టాప్స్‌) పథకానికి ఎంపికైతే విదేశీ శిక్షణ, ప్రఖ్యాత కోచ్‌ల మార్గదర్శనం అతన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుంది’ అని సంతోషం వెలిబుచ్చాడు. 

నిజానికి అతని నైపుణ్యానికి జూనియర్, జాతీయస్థాయిలో పతకాలెన్నో రావాలని... కానీ ఆశించినస్థాయిలో రాలేదన్నాడు. హరియాణా రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచినా జైపూర్‌లో జరిగిన సీనియర్‌ జాతీయ పోటీల్లో ఒక్క పతకం గెలవలేదన్నాడు. అయినాసరే నిరాశపడకుండా కష్టపడే తత్వమే చిరాగ్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని కోచ్‌ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement