ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాత్కాలికంగా వాయిదా పడినా అసలు జరుగుతుందా.. లేదా అనే అనుమానం అభిమానులకు ఒక ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లలో కూడా ఇదే అనుమానం వ్యక్తం మవుతోంది. కరోనా వైరస్ ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో ఐపీఎల్ జరుగుతుందనే విషయాన్ని ఎవ్వరూ కచ్చితంగా చెప్పలేమని కింగ్స్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా పేర్కొన్నారు. ఈ టీ20 ఈవెంట్ జరుగుతుందనే విషయంపై తనకైతే స్పష్టత లేదన్నారు. (ఇక మ్యాచ్‌ల్లేవ్.. బీసీసీఐ షట్‌డౌన్!)
‘ప్రస్తుత పరిస్థితిని బట్టి రాబోవు టోర్నీ జరుగుతుందనే విషయాన్ని మనం చెప్పలేము. ఎవ్వరూ కూడా జరుగుతుందని చెప్పలేరు. దీనిపై క్లారిటీ లేదు. ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఎలా చెప్పగలం. రెండు-మూడు వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించిన తర్వాతే టోర్నీ నిర్వహణపై అంచనాకు రాగలం. కాకపోతే వాయిదా వేసిన సమయానికి కరోనా ప్రభావం తగ్గుతుందనే ఆశిస్తున్నాం’ అని శుక్రవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షాలతో భేటీ తర్వాత నెస్ వాడియా వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి సాధ్యమైనంత వరకూ రక్షణాత్మక పద్ధతిని అవలంభించడమే ఒక్కటే మార్గమన్నారు.
రీ షెడ్యూల్ సాధ్యమేనా?
భారత్‌లో 80కిపైగా కరోనా కేసులు ఉన్నట్లు నిర్దారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం అందుకు తగిన జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది. దాంతో భారత్‌లో జరగాల్సిన ఉన్న అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు బ్రేక్ పడింది. వీటిలో కొన్నింటిని రీ షెడ్యూల్ చేసి జరిపే అవకాశాలున్నప్పటికీ, ఐపీఎల్ వంటి ఒక మేజర్ టోర్నీని రీ షెడ్యూల్ చేయడం కష్టంతో కూడుకున్న పని. ఐపీఎల్ ఆడబోయే మెజారిటీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటేనే ఐపీఎల్‌ను రీషెడ్యూల్ చేయడం సాధ్యపడుతుంది. మార్చి 29వ తేదీన ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. ఆ సమయానికి విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటే ఇబ్బంది ఉండదు. వారు దాదాపు ఐపీఎల్ పూర్తయ్యే వరకూ ఫ్రాంచైజీలతో ఉంటే ఆ లీగ్ సజావుగానే సాగుతుంది. అలా ఉండాలంటే సదరు ఆటగాళ్లు ఆడే జాతీయ జట్లకు ఏ సిరీస్‌లు ఉండకూడదు. (వాయిదా వేసి మంచిపని చేసింది : గవాస్కర్)
కాని పక్షంలో ఐపీఎల్ సుదీర్ఘ షెడ్యూల్‌ను కుదించాల్సి ఉంటుంది. రెండు గ్రూప్‌లుగా విడగొట్టి టోర్నీని తగ్గించాలి. అంటే టాప్-4లో ఉన్న జట్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లేలా నిబంధన ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో ఒక రోజు రెండేసి మ్యాచ్‌లు సంఖ్యను ఎక్కువగా పెంచాల్సి ఉంటుంది. ఇక్కడ ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నుంచి అభ్యంతరాలు తప్పకపోవచ్చు. ప్రధానంగా టీఆర్పీ కోసమే రోజువారీ మ్యాచ్‌ల సంఖ్యను గతం కంటే తగ్గిస్తే, ఇప్పుడు అదే అంశం మరోసారి తెరపైకి వచ్చేలా ఉంది. ఏమైనా ఐపీఎల్ వాయిదా పడటం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)తో పాటు ఫ్రాంచైజీలకు ఆందోళనకరంగా మారింది. ఐపీఎల్‌ను ఏదో రకంగా నిర్వహిస్తేనే నష్ట నివారణను కాస్తలో కాస్త తగ్గించవచ్చు.ఒకవేళ ఐపీఎల్ పూర్తిగా జరగ్గపోతే మాత్రం బీసీసీఐతో పాటు ఫ్రాంచైజీలు భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment