ప్రతి బ్యాడ్మింటన్ టోర్నీ ఫిక్సయ్యేదే..
డెన్మార్క్ ఆటగాడు విట్టింగస్ ఆరోపణ
సింగపూర్: బ్యాడ్మింటన్‌లో దాదాపు ప్రతీ టోర్నమెంట్‌లోనూ ఫిక్సింగ్ జరుగుతుంటుందని డెన్మార్క్ ఆటగాడు హన్స్ క్రిస్టియాన్ విట్టింగస్ సంచలన ఆరోపణలు చేశాడు. కచ్చితంగా కొన్ని ఈవెంట్స్ ముందే రిగ్గింగ్ అవుతాయని చెప్పాడు. ప్రపంచ 11వ ర్యాంకర్ అయిన విట్టింగస్‌ను గతేడాది ఓ మలేసియన్ ఫిక్సింగ్ కోసం సంప్రదించాడు. ‘బ్యాడ్మింటన్‌లో డబ్బు ప్రవాహం పెరిగింది. ఓరకంగా ఇది మంచి విషయమే అయినా అదే డబ్బు మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు కూడా ఉసిగొల్పుతోంది. నేనైతే మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగుతుందని కచ్చితంగా చెప్పగలను.
లేదు అని ఎవరైనా అంటే అది వారి అమాయకత్వమే. అందుకే ఏ టోర్నీ కూడా స్వచ్ఛంగా లేదు. ఆధునిక యుగంలో మనం జీవిస్తున్నాం. ఇంటర్‌నెట్ ద్వారా కూడా ఇది వ్యాపించగలదు’ అని విట్టింగస్ అన్నాడు. గతేడాది జపాన్ ఓపెన్ సందర్భంగా ఫిక్సింగ్ కోసం ఓ వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా తనను సంప్రదించాడని చెప్పాడు. అదే ఏడాది జరిగిన సింగపూర్ ఓపెన్, థామస్ కప్‌ల్లో మ్యాచ్‌లను ఫిక్స్ చేయాల్సిందిగా కోరాడని తెలిపాడు. విట్టింగస్ సహచరులు డేన్, కిమ్ అస్ట్రప్‌లను కూడా ఇలాగే సంప్రదించిన బుకీలు వేల డాలర్లను ఇవ్వజూపారు. అయితే వీరంతా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్యకు ఫిర్యాదు చేశారు.