హోల్గర్ రూనె, సిట్సిపాస్
పారిస్: రెండేళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచిన గ్రీస్ స్టార్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్ ఈసారి మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టాడు. సోవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 40వ ర్యాంకర్, డెన్మార్క్‌కు చెందిన 19 ఏళ్ల హోల్గర్ రూనె 7–5, 3–6, 6–3, 6–4తో నాలుగో సీడ్ సిట్సిపాస్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు.
ఈ విజయంతో హోల్గర్ రూనె తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 3 గంటల ఒక నిమిషంపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హోల్గర్ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. సిట్సిపాస్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఈ డెన్మార్క్ టీనేజర్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. సిట్సిపాస్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేశాడు.
రూడ్ ముందంజ
ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) తమ ప్రత్యర్థులపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రూడ్ 6–2, 6–3, 3–6, 6–3తో 12వ సీడ్ హుర్కాజ్ (పోలాండ్)ను ఓడించి తన కెరీర్‌లో మొదటిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరగా... 11వ సీడ్ జాక్ సినెర్ (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో రుబ్లెవ్ తొలి సెట్‌ను 1–6తో కోల్పోయి రెండో సెట్‌ను 6–4తో నెగ్గి, మూడో సెట్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ దశలో గాయం కారణంగా సినెర్ వైదొలిగాడు. ఈ గెలుపుతో రుబ్లెవ్ తన కెరీర్‌లో ఐదోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో వెరోనిరా కుదుర్‌మెతోవా (రష్యా) 1–6, 6–3, 6–1తో 22వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై, 20వ సీడ్ కసత్‌కినా (రష్యా) 6–2, 6–2తో కామిలా జార్జి (ఇటలీ)పై, 11వ సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 4–6, 6–2, 6–3తో ఇరీనా బేగూ (రొమేనియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment