వెల్‌డన్ ధోనీ.. మంచి పని చేశావు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ శుక్రవారం రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రపాలి బ్రాండ్ అంబాసిడర్‌గా వైదొలగడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నోయిడాలోని సదరు రియల్ ఎస్టేట్ సంస్థ బాధితులే కాకుండా సహచర టీమిండియా క్రికెటర్లు కూడా ధోనీ నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. ఈ విషయంలో ధోనీకి స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు.
'వెల్‌డన్ ధోనీ. అమ్రాపాలి బిల్డర్ బ్రాండ్ అంబాసిడర్ వైదొలిగావు. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత క్రికెటర్లకు విల్లాలు ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. కానీ ఇవ్వలేదు' అని భజ్జీ ట్వీట్ చేశారు. నోయిడాలోని అమ్రాపాలి రియల్టీ ప్రాజెక్టులో పెండింగ్ పనులు ఎంతకూ పూర్తికాకపోవడంతో విసుగుచెందిన ఆ కాలనీ వాసులు ట్విట్టర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. తమ సమస్యలు విన్నవించుకుంటూ.. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ధోనీ తీరును కూడా తప్పుబట్టారు. ఈ వివాదం నేపథ్యంలో ధోనీ అమ్రాపాలి బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పుకొన్నాడు.
Well done @msdhoni for dropping #Amarpali builders s brand ambassadorship..they didn't gave us VILLAS they announce after 2011 worldcup win
— Harbhajan Singh (@harbhajan_singh) 16 April 2016
నోయిడా సెక్టర్ 45లోని అమ్రాపాలి 'షప్పైర్' ప్రాజెక్టులో 800 కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే, తొలిదఫా ప్రాజెక్టులో ఇప్పటికీ విద్యుత్ సదుపాయం కల్పించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కాలనీ వాసులు చెప్తున్నారు. ఈ వివాదంపై గతంలో స్పందించిన ధోనీ బిల్డర్‌తో మాట్లాడి.. కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే.