
కంగారొద్దు... కొట్టేద్దామిలా!
ఆస్ట్రేలియాను సొంతగడ్డ మీద ఓడించే సత్తా భారత్‌కు ఉందా? కోట్లాది మంది అభిమానుల్లో ఉన్న అనుమానం ఇది. కచ్చితంగా భారత్‌కు ఆ సత్తా ఉంది. ప్రపంచకప్ కంటే ముందు ఏం జరిగిందో గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటి పిచ్‌లు వేరు, ప్రపంచకప్ ఆడుతున్న డ్రాప్ ఇన్ పిచ్‌లు వేరు. అయితే టోర్నీలో వరుసగా ఏడు మ్యాచ్‌లు గెలిచినంత సులభం కాదు ఆస్ట్రేలియా మీద నెగ్గడం అంటే. కచ్చితంగా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించాలి. అసలు ఆస్ట్రేలియా మీద గెలవాలంటే ఏం చేయాలి? ఎలా ఆడాలి?
ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేస్తే...
వార్నర్, మ్యాక్స్‌వెల్ ఆ జట్టులోని విధ్వంసకర ఆటగాళ్లు. వార్నర్ 30 ఓవర్లు, మ్యాక్స్‌వెల్ 15 ఓవర్లు క్రీజులో ఉంటే ఆసీస్ 350 మార్కును టచ్ చేస్తుంది. కాబట్టి ఈ ఇద్దరినీ క చ్చితంగా ఆపాలి.
ఒకవేళ ఆ ఇద్దరూ విఫలమైనా... స్మిత్, క్లార్క్ జాగ్రత్తగా ఆడితే 300 సులభంగా దాటుతారు. కాబట్టి ఈ ఇద్దరిలో ఒక్కరినైనా తొందరగా అవుట్ చేయాలి.
ఛేజింగ్‌లో కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆసీస్‌ను 250-270 పరుగుల దగ్గర నియంత్రించగలిగితే భారత్‌కు మంచి అవకాశాలు ఉంటాయి.
ఆసీస్ ఛేజింగ్ చేస్తే...
భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 300 చేసినా... ఆస్ట్రేలియా కచ్చితంగా చివరి దాకా పోరాడుతుంది. ఛేజింగ్‌లో వికెట్లు కూడా బాగా పడతాయి. ఛేజింగ్‌లో ప్రమాదకర ఆటగాళ్లు ఇద్దరు. వాట్సన్, ఫాల్క్‌నర్. ముఖ్యంగా చివరి ఓవర్లలో ఫాల్క్‌నర్ రెండు ఓవర్లలోనైనా ఫలితాన్ని మారుస్తాడు. కాబట్టి ఫాల్క్‌నర్ కోసం ప్రణాళికలు బాగా సిద్ధం చేసుకోవాలి. జాన్సన్, స్టార్క్‌లకు కూడా బ్యాటింగ్ నైపుణ్యం ఉంది కాబట్టి వారినీ నియంత్రించాలి.
భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తే...
టాప్-3లో రోహిత్, ధావన్, కోహ్లి ముగ్గురిలో కనీసం ఒక్కరైనా పెద్ద ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేయాలి. ఒకరు విఫలమైనా... ఇంకొకరు కనీసం ఓ 15-20 ఓవర్లు క్రీజులో నిలబడి, సెంచరీ చేస్తున్న బ్యాట్స్‌మెన్‌కు అండగా ఉండాలి.
రైనా 35వ ఓవర్‌లోపు, ధోని 40వ ఓవర్‌లోపు బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం లేకుండా చూడాల్సిన బాధ్యత రహానేది. ఈ ఓవర్ల మార్కు దాటిన తర్వాత రైనా, ధోని క్రీజులోకి వచ్చారంటే భారత్ సులభంగా 300 దాటుతుందని అర్థం.
భారత్ ఛేజింగ్ చేస్తే...
లక్ష్యం 300కు దగ్గరగా ఉంటే ఓపెనర్లలో ఒక్కరు కచ్చితంగా దూకుడుగా ఆడాలి. తొలి 10 ఓవర్లలో వేగంగా ఆడి అవుటైనా... 80 స్కోరు రావాలి. లేదంటే చివరి దశలో లక్ష్యం కొండలా మారుతుంది.
టాప్-3, రహానే కలిసి 35 ఓవర్ల వరకూ కచ్చితంగా క్రీజులో నిలబడాలి.
రైనా, ధోని అద్భుతమైన ఫామ్‌లో ఉన్నందున ఛేజింగ్ విషయంలో ధీమాగా ఉండొచ్చు. అయితే చివరి 10 ఓవర్లలో 100పైన కొట్టాల్సి వస్తే వీళ్లు కూడా ఒత్తిడిలోకి వెళతారు.
ఆ 70 ఒకెత్తు... ఈ పదీ ఒకెత్తు
భారత బౌలర్లు టోర్నీలో ఎదురైన ప్రతి ప్రత్యర్థినీ ఆలౌట్ చేశారు. ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయడం అంత సులభం కాదు. అయితే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను కూడా మనోళ్లు ఆలౌట్ చేసిన విషయం మరచిపోకూడదు. ఆసీస్‌ను భారత బౌలర్లు ఆలౌట్ చేయగలిగితే... మ్యాచ్ దాదాపుగా మనం గెలిచినట్లే.
300కు అటూ ఇటూ...
భారత బ్యాట్స్‌మెన్ తొలుత బ్యాటింగ్ చేస్తే 300కు కాస్త అటూ ఇటుగా పరుగులు చేయగలుగుతారు. మన బౌలర్లు కూడా 300 అయితే కాపాడగలుగుతారు. కాబట్టి ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేస్తే 300 దాటకుండా చూడాలి. ఒకవేళ భారత్ ముందుగా ఆడితే 300 కచ్చితంగా దాటాలి.