‘ఎక్స్‌ప్రెస్ కు బ్రేక్‌లు
‘ఎక్స్‌ప్రెస్ కు బ్రేక్‌లు
Published Sun, Sep 14 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM
రాయ్‌పూర్: లక్ష్యంలో సగానికి పైగా పరుగులు చేసిన నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ (29 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. సదరన్ ఎక్స్‌ప్రెస్ బౌలర్లకు బ్రేక్‌లు వేస్తూ ఒంటిచేత్తో తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఫలితంగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ 7 వికెట్ల తేడాతో సదరన్ ఎక్స్‌ప్రెస్‌పై విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 10 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.... బ్యాటింగ్‌కు దిగిన సదరన్10 ఓవర్లలో 5 వికెట్లకు 92 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (20 బంతుల్లో 37; 7 ఫోర్లు), గుణతాలిక (26 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. గుణతాలిక, ప్రసన్న (7) రెండో వికెట్‌కు 28 పరుగులు జోడించినా మిగతా బ్యాట్స్‌మెన్ వేగంగా ఆడే ప్రయత్నంలో స్వల్ప విరామాల్లో అవుటయ్యారు. బౌల్ట్ 2, సౌతీ, స్టైరిస్ చెరో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ జట్టు 9.3 ఓవర్లలో 3 వికెట్లకు 96 పరుగులు చేసి గెలిచింది. కేన్ విలియమ్సన్ వీరవిహారానికి తోడు డివిచ్ (8 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్), ఫ్లిన్ (11 బంతుల్లో 14; 1 సిక్స్) సమయోచితంగా ఆడారు. డివిచ్‌తో కలిసి తొలి వికెట్‌కు 41 పరుగులు; ఫ్లిన్‌తో కలిసి రెండో వికెట్‌కు 33 పరుగులు జోడించిన విలియమ్సన్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. చివర్లో హారిస్ (6 బంతుల్లో 10 నాటౌట్; 1 ఫోర్), స్టైరిస్ (4 నాటౌట్) నిలకడగా ఆడి విజయాన్ని అందించారు. విలియమ్సన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు
సదరన్ ఎక్స్‌ప్రెస్ ఇన్నింగ్స్: కుశాల్ పెరీరా (సి) బౌల్ట్ (బి) స్టైరిస్ 37; గుణతాలిక (బి) బౌల్ట్ 39; ప్రసన్న రనౌట్ 7; ముబారక్ (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 1; ఎంజెలో పెరీరా (సి) డివిచ్ (బి) సౌతీ 1; మహరూఫ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (10 ఓవర్లలో 5 వికెట్లకు) 92
వికెట్ల పతనం: 1-55; 2-83; 3-85; 4-91; 5-92
బౌలింగ్: బౌల్ట్ 2-0-12-2; సౌతీ 2-0-20-1; కుగ్‌ల్జీన్ 1-0-11-0; స్టైరిస్ 2-0-18-1; సోధి 2-0-10-0; డివిచ్ 1-0-18-0.
నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్: కేన్ విలియమ్సన్ (బి) మహరూఫ్ 52; డివిచ్ (సి) డి.పెరీరా (బి) మహరూఫ్ 14; ఫ్లిన్ (సి) కుశాల్ పెరీరా (బి) డి.పెరీరా 14; హారిస్ నాటౌట్ 10; స్టైరిస్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: (9.3 ఓవర్లలో 3 వికెట్లకు) 96
వికెట్ల పతనం: 1-41; 2-74; 3-86
బౌలింగ్: డి.పెరీరా 2-0-11-1; ప్రసన్న 1-0-14-0; గుణతాలిక 1-0-19-0; మహరూఫ్ 2-0-14-2; జయంపతి 2-0-18-0; పతిరనా 1.3-0-19-0.
Advertisement
Advertisement