నాటింగ్‌హామ్‌లో అంతే!
రవీంద్ర జడేజా, అండర్సన్ మధ్య వివాదం ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య సుదీర్ఘ టెస్టు సిరీస్ ఆరంభంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. తొలి టెస్టు రెండో రోజు లంచ్ విరామ సమయంలో జడేజాను తోసేయడంతో పాటు దూషణకు దిగిన అండర్సన్ నిషేధాన్ని ఎదుర్కొనే ప్రమాదంలో పడ్డాడు.
ఇరు జట్ల కెప్టెన్లు కూడా తమ ఆటగాళ్లకే మద్దతుగా నిలిచి పరస్పర ఫిర్యాదులు నమోదు చేయడంతో వాతావరణం వేడెక్కింది. క్రికెటేతర కారణం ఈ సిరీస్‌నూ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చేసింది. వరుసగా మూడో ఇంగ్లండ్ పర్యటనలోనూ భారత్ నేరుగా తమ పాత్ర లేకున్నా వివాదంలో భాగమైంది. 2007లో, ఆ తర్వాత 2011 సిరీస్‌లలో కూడా జట్టు వివాదానికి కేంద్రంగా మారింది. అయితే ఈ మూడు ఘటనలూ నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలోనే జరగడం విశేషం!
-సాక్షి క్రీడా విభాగం
చేదు ‘జెల్లీ’
చిన్నపిల్లల ఆటలాగా ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లో ఆటగాళ్లు ‘చిల్లర’ చేష్టలు చేస్తారా అని ఆశ్చర్యపడే విధంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు వ్యవహరించారు. 2007 పర్యటనలో నాటింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టు మూడో రోజు ఈ ఘటన చోటు చేసుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో జహీర్ ఖాన్ బ్యాటింగ్‌కు వచ్చే ముందు వికెట్‌కు సమీపంలో కొన్ని జెల్లీ బీన్స్ కనిపించాయి. వాటిని పక్కన పడేసిన జహీర్ ఆట కొనసాగించాడు. అయితే ఆ వెంటనే మళ్లీ జెల్లీ బీన్స్ అతనికి దగ్గరలో పడ్డాయి.
దాంతో ఇది కావాలని చేస్తున్నాడని భావించిన జహీర్, అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా పీటర్సన్ వైపు బ్యాట్ చూపించి ‘ఏమిటిదంతా...నేను క్రికెట్ ఆడటానికి వచ్చాను’ అని హెచ్చరించాడు. పీటర్సన్ అమాయకత్వం నటిస్తే... క్రీజ్‌కు దగ్గరలో ఉన్న బెల్, కుక్ కూడా తమకేమీ తెలీదన్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ వాన్... స్లిప్‌నుంచి విసరలేదన్నాడే గానీ ఎక్కడనుంచి వచ్చాయో చెప్పలేదు. ఇంగ్లండ్ మీడియా జెల్లీబీన్ గేట్ అంటూ వివాదానికి ఆజ్యం పోసింది. అన్నట్లు...ఈ ఘటన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో రెచ్చిపోయిన జహీర్ 5 వికెట్లు తీసి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు.
ఎవరిది క్రీడా స్ఫూర్తి..?
మరో నాలుగేళ్ల తర్వాత ఇదే ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలోనే ఇంగ్లండ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా... ‘క్రీడా స్ఫూర్తి లేని జట్టు’ అంటూ టీమిండియానే ఒక దశలో భారం మోయాల్సి వచ్చింది. మ్యాచ్ మూడో రోజు టీ విరామానికి ముందు ఈ ఘటన జరిగింది. రెండో సెషన్ ఆఖరి బంతిని మోర్గాన్ షాట్ కొట్టగా బౌండరీ వద్ద ప్రవీణ్ ఆపాడు. అయితే అది బౌండరీ దాటిందని భావించిన మరో బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్ తన పరుగును పూర్తి చేయకుండా టీ విరామం కోసం మైదానం వైపు కదిలాడు. బంతిని అందుకొని బెయిల్స్ గిరాటేసిన భారత ఫీల్డర్లు అప్పీల్ చేశారు.
రీప్లేలో భారత్ నిబంధనల ప్రకారమే చేసిందని, అది ‘అవుట్’ అని తేలింది. అప్పీల్‌ను వెనక్కి తీసుకునేందుకు ధోని అంగీకరించలేదు. అయితే విరామ సమయంలో మరో డ్రామా జరిగింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్ట్రాస్, కోచ్ ఫ్లవర్ భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి విజ్ఞప్తి చేశారు. మరో వైపు మైదానంలో భారత్ వ్యతిరేక నినాదాలు అప్పటికే మొదలయ్యాయి. క్రీడా స్ఫూర్తి లేదంటూ ఇంగ్లండ్ అభిమానులు చెలరేగిపోయారు. చివరకు ధోని అప్పీల్ వెనక్కి తీసుకొని బెల్‌ను మళ్లీ మైదానంలోకి పిలిచాడు. అనంతరం అతను మరో 22 పరుగులు జత చేశాడు. ఈ ఘటన సమయానికే భారత్ చేతుల్లోంచి మ్యాచ్ వెళ్లిపోయినా...వివాదం మాత్రం నిలిచిపోయింది.