న్యూఢిల్లీ: రవీంద్ర జడేజా, అండర్సన్ మధ్య జరిగిన గొడవలో ఇద్దరూ నిర్దోషులే అని తేల్చిన ఐసీసీ జ్యుడీషియల్ కమిషనర్ తీర్పుపై బీసీసీఐ ఆచితూచి స్పందించింది. పూర్తి కాపీ అందాకే తదుపరి చర్యల గురించి ఆలోచిస్తామని పేర్కొంది. ‘జ్యుడీషియల్ కమిషనర్ ఇచ్చిన తీర్పు పూర్తి పాఠం నేడు (ఆదివారం) అందే అవకాశం ఉంది. అది వచ్చాకే ఈ అంశంలో తదుపరి ఏం చేయాలనే దానిపై మాకు స్పష్టత వస్తుంది. మేం ఎలా ముందుకు వెళ్లాలనుకున్నా న్యాయపరంగా పూర్తి విశ్లేషణ అవసరం. తీర్పును మా కౌన్సిల్ పూర్తిగా చదివి మాకు సూచనలిస్తుంది. ఇలాంటి కేసులో ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే మాకు కాస్త సమయం పడుతుంది.
అప్పీల్ చేసుకునే విషయంలో మాట్లాడడం తొందరపాటే అవుతుంది’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. అయితే జడేజాను దుర్భాషలాడుతూ అండర్సన్ తోసివేయడంపై ఎలాంటి వీడియో ఆధారాలు లేకపోవడంతో ఈ గొడవ కు ముగింపు పలకాలని బోర్డు భావించినట్టు సమాచారం. ఇక ఐసీసీ నిబంధనల ప్రకారం సీఈవో డేవ్ రిచర్డ్సన్‌కు మాత్రమే అప్పీల్ చేసే అధికారం ఉంటుంది. అయితే దీనికి ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వీరిద్దరి మధ్య విభేదాలు ఉండడంతో ఈ విషయంలో ఎలా ముందుకెళతారనేది ఆసక్తికరంగా మారింది.
ధోనిపై బ్రిటిష్ మీడియా గరం
జడేజా, అండర్సన్ వివాదంపై వెలువడిన తీర్పును ఆసరాగా చేసుకుని బ్రిటిష్ పత్రికలు భారత కెప్టెన్ ధోనిపై విరుచుకుపడుతున్నాయి. ‘భారత్‌కు మరో పరాభవం’ పేరిట తమ కథనాలను ప్రచురించాయి. అండర్సన్‌పై కక్ష తీర్చుకుందామనుకున్న ధోని ప్రయత్నాలు బెడిసికొట్టాయని ‘డెయిలీ టెలిగ్రాఫ్’ అనే పత్రిక కథనం రాసింది. డెయిలీ మెయిల్, గార్డియన్ పత్రికలు కూడా ఇదే రీతిన ధోనిపై దుమ్మెత్తిపోశాయి.
‘కాపీ’ అందాకే స్పందిస్తాం: బీసీసీఐ
Published Sun, Aug 3 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM
Advertisement
Advertisement