ఆల్‌రౌండర్ జడేజా, అండర్సన్ గొడవకు సంబంధించి జ్యుడీషియల్ కమిషనర్ గార్డన్ లూయిస్ ఇచ్చిన తీర్పుపై బీసీసీఐ చేసిన అప్పీల్‌ను ఐసీసీ తోసిపుచ్చింది.
దుబాయ్: ఆల్‌రౌండర్ జడేజా, అండర్సన్ గొడవకు సంబంధించి జ్యుడీషియల్ కమిషనర్ గార్డన్ లూయిస్ ఇచ్చిన తీర్పుపై బీసీసీఐ చేసిన అప్పీల్‌ను ఐసీసీ తోసిపుచ్చింది. లూయిస్ సరైన నిర్ణయం తీసుకున్నారని సమర్థించింది. ‘అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే లూయిస్ తీర్పు వెలువరించారు. అతని నిర్ణయం మాకు సంతృప్తినిచ్చింది. జడేజా, అండర్సన్ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడలేదు’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
చాలా సున్నితమైన ఇలాంటి కేసును పొడిగిస్తూ అప్పీల్‌కు వెళ్లడం సరైంది కాదని ఐసీసీ సీఈఓ రిచర్డ్‌సన్ అన్నారు. ‘చాలా సున్నితమైన, క్లిష్టమైన కేసు ఇది. ఐసీసీ నియమావళి ప్రకారం ఇద్దరు ఆటగాళ్లపై రకరకాల అభియోగాలు నమోదయ్యాయి. ఇరువైపుల నుంచి విరుద్ధమైన అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ కేసులో 13 మంది వాంగ్మూలాలు ఇచ్చారు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాతే లూయిస్ తీర్పు వెలువరించారు. కాబట్టి ఈ కేసులో మరిన్ని విచారణలు అవసరం లేదు’ అని అన్నారు.