
టికెట్ల అమ్మకాలు షురూ
బ్రెజిల్ లో త్వరలో జరగనున్న ఒలింపిక్స్ టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఆగస్టు 5 నుంచి 21 వరకు రియో డి జెనిరోలో ఈ క్రీడోత్సవాలు జరుగుతాయి. వాటి టికెట్లను స్థానిక దుకాణాలలో తొలిసారిగా అమ‍్మకాలకు పెట్టినట్లు ఒలింపిక్స్ నిర్వాహకులు తెలిపారు. ఇంతకుముందు బ్రెజిల్ వాసులకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే టికెట్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రియోలోని రెండు షాపింగ్ మాల్స్ లో కూడా వాటిని అమ్మకానికి పెట్టారు. రాబోయే వారాల్లో రియోతో పాటు ఒలింపిక్స్ ఫుట్ బాల్ మ్యాచ్ లు జరిగే సావో పాలో, బెలో హారిజాంట్, సాల్వడార్, బ్రసీలియా, మనౌస్ నగరాల్లో 30 టికెట్ కౌంటర్లను త్వరలో ప్రారంభిస్తామని చెబుతున్నారు.
టికెట్ కౌంటర్ల వద్ద భారీగా రష్ ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నామని, అందువల్ల బ్రెజిల్ వాసులు చిట్ట చివరి నిమిషం వరకు ఆగకుండా ముందే టికెట్లు కొనుక్కోవాలని సూచించారు. వెబ్ సైట్ లో ఉన్న ధరలకే టికెట్ కౌంటర్లలో కూడా అమ్ముతున్నారో లేదో జాగ్రత్తగా చూసుకోవాలని, అధిక ధర చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే ఒలింపిక్స్ కోసం 42 లక్షల టికెట్లు అమ్మేశామని, మరో 18 లక్షల టికెట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఒలింపిక్ టికెట్ల ధరలు ఆయా క్రీడాంశాలను బట్టి రూ. 800 నుంచి కొన్ని వేల వరకు ఉన్నాయి.