
కోహ్లి చెప్పింది అక్షరసత్యం..
బెంగళూరు:ఒక ఆటగాడు తనకు తాను నిరూపించుకోవాలంటే సాధ్యమైనన్ని అవకాశాలు పొందాలని అంటున్నాడు టీమిండియా ఆటగాడు స్టువర్ట్ బిన్నీ. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పిన ఈ అభిప్రాయంతో అందరూ ఏకీభవించాలన్నాడు. 'విరాట్ చెప్పినదాంట్లో వాస్తవం ఉంది. ఆటగాడు నిరూపించుకోవాలంటే ఎక్కువ అవకాశాలు పొందాలి. అలా దక్కితేనే ఆటగాడి ప్రతిభ బయటకు వస్తుంది. విరాట్ చెప్పింది అక్షర సత్యం' అని అన్నాడు. త్వరలో జరిగే దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కు ఎంపికైన బిన్నీ.. తనకు ఆన్ ఫీల్డ్ లో నిరూపించుకునే అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయన్నాడు. ఇప్పటివరకూ తన అంతర్జాతీయ కెరీయర్ చూస్తే ఐదు టెస్లులు, 13 వన్డేలు, 2 ట్వంటీ 20 మ్యాచ్ లు ఆడినట్లు పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికా సిరీస్ తమకు చాలా కఠినమైనదని... నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నసఫారీలను ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నాడు. తాను బౌలింగ్ చేయడాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తానన్నాడు. కొత్త బంతితో స్వింగ్ చేయగల సామర్థ్యం తనలో ఉందని.. దక్షిణాఫ్రికా సిరీస్ లో ఆ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఇటు వన్డేలు, ట్వంటీ 20లకు ఎంపిక కావడంపై బిన్నీ హర్షం వ్యక్తం చేశాడు. అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేస్తాను కాబట్టే తనను రెండు ఫార్మెట్లలో ఎంపిక చేశారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.