కోహ్లి టెక్నిక్ను మార్చుకోలేక పోవచ్చు..కానీ
న్యూఢిల్లీ: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ టెక్నిక్ అంత గొప్పగా ఏమీ లేదంటూ ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ చేసిన వ్యాఖ్యలను మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఖండించాడు. అండర్సన్ చేసిన వ్యాఖ్యలు అతని అసహనానికి అద్దం పడుతుందని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఈ తరహా వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికాదంటూ గవాస్కర్ విమర్శించాడు. అండర్సన్ చేసిన వ్యాఖ్యలు అతని వ్యక్తిత్వాన్ని సూచిస్తాన్నయే తప్పా, దీనివల్ల విరాట్ కు ఒరిగే నష్టమేమీ లేదన్నాడు.
అటు వంటి వ్యాఖ్యలతో అండర్సన్ తన గుణాన్ని బయటపెట్టుకున్నట్లు అవుతుందంటూ గవాస్కర్ చురకలంటించాడు.కోహ్లి తన టెక్నిక్ను మార్చుకోలేకపోవచ్చు.. కానీ టెంపర్మెంట్లో చాలా బలంగా ఉన్నాడనే విషయం అండర్సన్ గ్రహిస్తే మంచిదన్నాడు. బాలురు స్థాయి నుంచి మనుషులుగా మార్చిదే ఏమైనా ఉందంటే అది వారి సానుకూల స్వభావమేనని గవాస్కర్ సూచించాడు. ఈ విషయంలో విరాట్ చాలా ఎత్తులో ఉన్నాడన్నాడు. ఒక జట్టు ఓటమి పాలైనప్పుడు దాన్ని అంగీకరించే స్వభావం కూడా ఇక్కడ ముఖ్యమని అండర్సన్ కు ఈ లిటిల్ మాస్టర్ హితబోధ చేశాడు.
ఇటీవల కాలంలో బ్యాటింగ్ లో ఎంతో పరిణితి చెందిన విరాట్ పై గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. వాంఖేడ్ స్టేడియంలో ఇంతకుముందెన్నడూ విరాట్ తరహా ప్రదర్శన చూడలేదన్నాడు. ఒక టర్నింగ్ ట్రాక్పై విరాట్ డబుల్ సెంచరీ నమోదు చేయడమంటే అది అంత ఈజీ కాదన్నాడు. ఈ పిచ్లో సెంచరీ వరకూ ఒక మంచి ఆటగాడ్ని నుంచి ఆశించవచ్చు.. కానీ అంతకుమించి ఆడటమంటే ఎంతో ప్రతిభ కావాలంటూ గవాస్కర్ కొనియాడాడు. ప్రస్తుతం అత్యంత విలువైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా విరాట్ కోహ్లినేని తెలిపాడు.