
మరో విజయానికి అడుగుదూరంలో..
పుజు (చైనా): చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు దూసుకెళ్తోంది. కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు కేవలం అడుగుదూరంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో హైదరాబాదీ ఫైనల్లో ప్రవేశించింది. శనివారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఏడో సీడ్ సింధు 11-21, 23-21, 21-19 స్కోరుతో ఆరో సీడ్ సుంగ్ జి హ్యున్‌పై విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో సున్ యుతో తలపడనుంది.
సెమీస్ పోరులో సింధుకు గట్టి పోటీ ఎదురైంది. మ్యాచ్ ఆరంభంలో సుంగ్‌ను నిలువరించడంలో విఫలమైంది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు వెంటనే పుంజుకుని సత్తాచాటింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన చివరి రెండు గేమ్‌లను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.