china open super series
-
చైనా ఓపెన్ సిరీస్ నుంచి సైనా ఔట్
పుజౌ (చైనా) : చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అయిదో సీడ్ క్రీడాకారిణి అకానె యామగుచి (జపాన్) చేతిలో 18-21, 11-21 తేడాతో ఓటమి పాలైంది. తొలిసెట్లో కొంతసేపు పోరాడిన సైనా, రెండో రౌండ్లో పూర్తిగా పట్టు కోల్పోయింది. మరోవైపు పీవీ సింధు ఇవాళ ప్రిక్వార్ట్ ఫైనల్లో హాన్ యుయి (చైనా)తో తలపడనుంది. -
మరో విజయానికి అడుగుదూరంలో..
-
మరో విజయానికి అడుగుదూరంలో..
పుజు (చైనా): చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు దూసుకెళ్తోంది. కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు కేవలం అడుగుదూరంలో నిలిచింది. ఈ ఈవెంట్లో హైదరాబాదీ ఫైనల్లో ప్రవేశించింది. శనివారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఏడో సీడ్ సింధు 11-21, 23-21, 21-19 స్కోరుతో ఆరో సీడ్ సుంగ్ జి హ్యున్‌పై విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో సున్ యుతో తలపడనుంది. సెమీస్ పోరులో సింధుకు గట్టి పోటీ ఎదురైంది. మ్యాచ్ ఆరంభంలో సుంగ్‌ను నిలువరించడంలో విఫలమైంది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు వెంటనే పుంజుకుని సత్తాచాటింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన చివరి రెండు గేమ్‌లను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. -
సెమీస్‌లో పీవీ సింధు
ఫుజౌ (చైనా): భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీస్‌కు దూసుకెళ్లింది. కాగా మరో భారత ఆటగాడు అజయ్ జయరామ్ క్వార్టర్స్‌లో ఓటమి చవిచూశాడు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు 22-20, 21-10 స్కోరుతో స్థానిక క్రీడాకారిణి బింగ్జియావోపై విజయం సాధించింది. సింధు వరస గేమ్‌లలో మ్యాచ్‌ను ముగించింది. తొలి గేమ్‌లో హైదరాబాదీకి హోరాహోరీ పోరు ఎదురుకాగా, రెండో గేమ్‌ను సునాయసంగా గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో అజయ్ జయరామ్ 15-21, 14-21 తేడాతో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
రన్నరప్‌తో సరి
చైనా ఓపెన్ ఫైనల్లో లీ జురుయ్ చేతిలో సైనా ఓటమి ఫుజౌ (చైనా): వరుసగా రెండో ఏడాది చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఓటమి చవిచూసింది. లండన్ ఒలింపిక్స్ విజేత, ప్రపంచ ఏడో ర్యాంకర్ లీ జురుయ్ (చైనా)తో జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సైనా 12-21, 15-21తో పరాజయం పాలైంది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ తుది పోరులో సైనా పలుమార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. విజేతగా నిలిచిన లీ జురుయ్‌కు 52 వేల 500 డాలర్లు (రూ. 34 లక్షల 70 వేలు), రన్నరప్ సైనా నెహ్వాల్‌కు 26 వేల 600 డాలర్లు (రూ. 17 లక్షల 58 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సైనా తుది సమరంలో మాత్రం తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబరచడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌కు ముందు సైనాను తొమ్మిది సార్లు ఓడించిన అనుభవం ఉన్న లీ జురుయ్ ఈసారీ పక్కా ప్రణాళికతో ఆడి భారత స్టార్ ఆట కట్టించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సైనా తొలి గేమ్ మొదట్లో 4-1తో ముందంజ వేసింది. అయితే సొంత ప్రేక్షకుల సమక్షంలో ఆడిన లీ జురుయ్ వెంటనే తేరుకొని ఆరు పాయింట్లు స్కోరు చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ చైనా స్టార్ వెనుదిరిగి చూడలేదు. నిలకడగా పాయింట్లు సాధిస్తూ తొలి గేమ్‌ను 16 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సైనా కొలుకున్నట్లు కనిపించింది. డ్రాప్ షాట్లు, స్మాష్ షాట్లతో చెలరేగిన ఈ భారత స్టార్ 12-6తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సైనా ఆటతీరుపై మంచి అవగాహన ఉన్న లీ జురుయ్ ఒక్కసారిగా విజృంభించింది. వరుసగా ఏడు పాయింట్లు సాధించి 13-12తో ఆధిక్యంలోకి వచ్చింది. భారీ ఆధిక్యాన్ని కోల్పోయిన సైనా ఈ దశలో డీలా పడింది. అనవసర తప్పిదాలు చేసి ఓటమిని ఖాయం చేసుకుంది. తాజా ఫలితంతో లీ జురుయ్‌తో ముఖాముఖి రికార్డులో సైనా 2-10తో వెనుకబడింది. చివరిసారి 2012 ఇండోనేసియా ఓపెన్‌లో లీ జురుయ్‌ను ఓడించిన సైనా ఆ తర్వాత ఆమెతో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఓ సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకొని ఓడిపోవడం సైనాకిది నాలుగోసారి. గతంలో సైనా ఇండోనేసియా ఓపెన్ (2011), ఫ్రెంచ్ ఓపెన్ (2012), ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ (2015) టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. రెండు గేముల్లో శుభారంభం చేశాను. అయితే దానిని నిలబెట్టుకోలేకపోయాను. ఫైనల్లో నా ఆటతీరుపట్ల నాకే ఆశ్చర్యమేసింది. షటిల్స్‌ను నియంత్రించలేకపోయాను. నేను కొట్టిన చాలా షాట్లు బయటకు వెళ్లాయి. మరోవైపు లీ జురుయ్ పక్కాగా ఆడింది. పాయింట్లను తొందరగా సాధించాలనే తాపత్రయంలో చాలా పొరపాట్లు చేశాను. నేనింకా కాస్త సంయమనంతో ఆడాల్సింది. ఈ టోర్నీకి సన్నద్ధం కావడానికి తగినంత సమయం లేకపోయినా, నా ఆటతీరు పట్ల సంతృప్తిగా ఉన్నాను. - సైనా నెహ్వాల్ -
సెమీస్‌లో సైనా
చైనా ఓపెన్ టోర్నమెంట్ ఫుజౌ (చైనా): డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా (భారత్) 21-16, 21-13తో ప్రపంచ పదో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై విజయం సాధించింది. 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. గతంలో ఒకుహారాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఈసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. గత ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన తర్వాత ఆడిన మూడు టోర్నీల్లో (జపాన్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన సైనా... చైనా ఓపెన్‌కు పక్కాగా సిద్ధమైంది. టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణిస్తూ ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. ఒకుహారాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా నిలకడగా పాయింట్లు సంపాదించింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ, అడపాదడపా స్మాష్‌లు సంధిస్తూ పూర్తి నియంత్రణతో ఆడింది. తొలి గేమ్ ఆరంభంలో 2-5తో వెనుకబడిన సైనా ఆ వెంటనే తేరుకొని వరుసగా మూడు పాయింట్లు నెగ్గి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత అదే జోరును కనబరిచి 11-8తో ఆధిక్యంలోకి వెళ్లింది. కీలకదశలో పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో సైనాకు ఒకుహారా ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. శనివారం జరిగే సెమీఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి యిహాన్ వాంగ్ (చైనా)తో సైనా అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో సైనా 3-9తో వెనుకంజలో ఉంది. అయితే ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో యిహాన్ వాంగ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సైనానే గెలుపొందడం విశేషం. నేటి సెమీఫైనల్స్ ఉదయం గం. 10.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
చైనా ఓపెన్ లో సైనా నెహ్వాల్ జోరు
పుజోహ్: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సైనా 21-16, 21-13 తేడాతో నొజోమి ఓకురా (జపాన్)పై గెలిచి సెమీస్ కు చేరింది. 42 నిమిషాల పాటు జరిగిన పోరులో సైనా పూర్తి ఆధిపత్యం సాధించింది. తొలి గేమ్ లో ఆదిలో 6-6 తో సమానంగా ఉన్న సమయంలో సైనా నెహ్వాల్ మరింత దూకుడుగా ఆడి 10-7 తో ముందంజ వేసింది. అదే ఊపును కడవరకూ కొనసాగించి ఆ సెట్ ను 21 నిమిషాల్లో కైవసం చేసుకుంది. కాగా, రెండో సెట్ లో నొజోమి నుంచి సైనాకు ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. రెండో సెట్ లో సైనా 5-2 తో ముందంజలో ఉన్నప్పుడు నొజోమి అనవసర తప్పిదాలతో పాయింట్లను సమర్పించుకుంది. అటు తరువాత సైనా 13-5 తేడాతో స్పష్టమైన ఆధిక్యం సాధించి నొజోమిని ఒత్తిడిలోకి నెట్టింది. ఆపై నొజోమి పుంజుకున్నా సైనా దూకుడు ముందు తలవంచక తప్పలేదు. -
చైనా ఓపెన్ టైటిల్‌పై సైనా కన్ను
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ సూపర్ సిరీస్‌లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ సీజన్లో ఇప్పటిదాకా టైటిల్ వేటలో విఫలమైన హైదరాబాదీ ఇందులోనైనా ఆ వెలితి తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. అలాగే తిరిగి టాప్-5 ర్యాంకుల్లోకి ఎగబాకాలనే లక్ష్యంతో ఉంది. షాంఘైలో ఈ టోర్నీ మంగళవారం నుంచి జరగనుంది. మొదటి రోజు క్వాలిఫయింగ్ పోటీలు, బుధవారం నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. 23 ఏళ్ల సైనా ఈ ఏడాది నిలకడలేమితో తడబడుతోంది. డెన్మార్క్ ఓపెన్‌లో టైటిల్ నిలబెట్టుకోలేకపోయిన ఆమె ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ నిరాశపరిచింది. దీంతో ఆమె ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి దిగజారింది. బుధవారం జరగనున్న తొలి రౌండ్లో ఆమె క్వాలిఫయర్‌తో తలపడనుంది. సైనా ఒక్కో అడ్డంకిని అధిగమిస్తే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ లీ జురుయ్ ఎదురుకావొచ్చు. ఇందులో సైనా గెలుపొందితే సెమీస్‌లో నాలుగో సీడ్ జి హ్యూన్ సంగ్ (దక్షిణ కొరియా) లేదంటే ఐదో సీడ్ జులియన్ షెంక్ (జర్మనీ)తో తలపడే అవకాశముంది. భారత్‌కు చెందిన మరో అమ్మాయి అరుంధతి పంతవనే తొలి రౌండ్లో జపాన్‌కు చెందిన ఎరికో హిరోస్‌తో పోటీపడనుంది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ పారుపల్లి కశ్యప్‌కు కాస్త కష్టమైన డ్రా ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ స్టార్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ బూన్సక్ పొన్సానా (థాయ్‌లాండ్)తో తలపడతాడు. ఇతర పోటీల్లో అజయ్ జయరామ్ క్వాలిఫయర్‌తో, ఆనంద్ పవార్... యాన్ కిత్ చాన్ (హాంకాంగ్)తో ఆడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మను అత్రి-సుమిత్ రెడ్డి ద్వయం... ఇవాన్ సొజొనొవ్-వ్లాదిమిర్ ఇవనొవ్ (రష్యా) జంటను ఎదుర్కొంటుంది.