
చైనా ఓపెన్ టైటిల్‌పై సైనా కన్ను
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ సూపర్ సిరీస్‌లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా టైటిల్ వేటలో విఫలమైన హైదరాబాదీ ఇందులోనైనా ఆ వెలితి తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. అలాగే తిరిగి టాప్-5 ర్యాంకుల్లోకి ఎగబాకాలనే లక్ష్యంతో ఉంది. షాంఘైలో ఈ టోర్నీ మంగళవారం నుంచి జరగనుంది. మొదటి రోజు క్వాలిఫయింగ్ పోటీలు, బుధవారం నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. 23 ఏళ్ల సైనా ఈ ఏడాది నిలకడలేమితో తడబడుతోంది.
డెన్మార్క్ ఓపెన్‌లో టైటిల్ నిలబెట్టుకోలేకపోయిన ఆమె ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ నిరాశపరిచింది. దీంతో ఆమె ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి దిగజారింది. బుధవారం జరగనున్న తొలి రౌండ్‌లో ఆమె క్వాలిఫయర్‌తో తలపడనుంది. సైనా ఒక్కో అడ్డంకిని అధిగమిస్తే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ లీ జురుయ్ ఎదురుకావొచ్చు. ఇందులో సైనా గెలుపొందితే సెమీస్‌లో నాలుగో సీడ్ జి హ్యూన్ సంగ్ (దక్షిణ కొరియా) లేదంటే ఐదో సీడ్ జులియన్ షెంక్ (జర్మనీ)తో తలపడే అవకాశముంది. భారత్‌కు చెందిన మరో అమ్మాయి అరుంధతి పంతవనే తొలి రౌండ్‌లో జపాన్‌కు చెందిన ఎరికో హిరోస్‌తో పోటీపడనుంది.
పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ పారుపల్లి కశ్యప్‌కు కాస్త కష్టమైన డ్రా ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ స్టార్ తొలి రౌండ్‌లో ఎనిమిదో సీడ్ బూన్సక్ పొన్సానా (థాయ్‌లాండ్)తో తలపడతాడు. ఇతర పోటీల్లో అజయ్ జయరామ్ క్వాలిఫయర్‌తో, ఆనంద్ పవార్... యాన్ కిత్ చాన్ (హాంకాంగ్)తో ఆడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో మను అత్రి-సుమిత్ రెడ్డి ద్వయం... ఇవాన్ సొజొనొవ్-వ్లాదిమిర్ ఇవనొవ్ (రష్యా) జంటను ఎదుర్కొంటుంది.