
సెమీస్‌లో సైనా
చైనా ఓపెన్ టోర్నమెంట్
ఫుజౌ (చైనా): డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా (భారత్) 21-16, 21-13తో ప్రపంచ పదో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై విజయం సాధించింది. 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది.
గతంలో ఒకుహారాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఈసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. గత ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన తర్వాత ఆడిన మూడు టోర్నీల్లో (జపాన్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన సైనా... చైనా ఓపెన్‌కు పక్కాగా సిద్ధమైంది. టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణిస్తూ ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. ఒకుహారాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా నిలకడగా పాయింట్లు సంపాదించింది.
సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ, అడపాదడపా స్మాష్‌లు సంధిస్తూ పూర్తి నియంత్రణతో ఆడింది. తొలి గేమ్ ఆరంభంలో 2-5తో వెనుకబడిన సైనా ఆ వెంటనే తేరుకొని వరుసగా మూడు పాయింట్లు నెగ్గి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత అదే జోరును కనబరిచి 11-8తో ఆధిక్యంలోకి వెళ్లింది. కీలకదశలో పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో సైనాకు ఒకుహారా ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది.
శనివారం జరిగే సెమీఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి యిహాన్ వాంగ్ (చైనా)తో సైనా అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో సైనా 3-9తో వెనుకంజలో ఉంది. అయితే ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో యిహాన్ వాంగ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సైనానే గెలుపొందడం విశేషం.
నేటి సెమీఫైనల్స్
ఉదయం గం. 10.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం