లంకపై పాక్ గెలుపు
మిర్పూర్: ఆసియాకప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు ఉండగానే పాక్ లక్ష్యాన్ని ఛేరుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ షార్జిల్ ఖాన్(24 బంతుల్లో 31), సర్ఫరాజ్ అహ్మద్ (27 బంతుల్లో 38), ఊమర్ అక్మల్(48: 4 ఫోర్లు, 2 సిక్సులు) రాణించడంతో పాక్ తన చివరి మ్యాచ్ లో గెలుపొందింది. ఊమర్ అక్మల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే, ఈ జట్లు ఇప్పటికే ఇంటి దారి పట్టాయి. మార్చి 6న జరగనున్న ఫైనల్లో బంగ్లాదేశ్, భారత్ తలపడనున్నాయి. లంక బౌలర్లలో కులశేఖర, జయసూర్య, దిల్షాన్, సిరివర్ధనే తలో వికెట్ తీశారు.
ఓపెనర్లు చండిమాల్(58; 49 బంతుల్లో 7ఫోర్లు,1 సిక్స్), దిల్షాన్(75;56 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్స్)లు రాణించి లంక గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. ఈ క్రమంలోనే ఈ టోర్నీలో తొలిసారి ఆకట్టుకున్న దిల్షాన్ హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. ఒకవైపు తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూనే చివరి వరకూ క్రీజ్లో నిలిచి బాధ్యాతయుత ఇన్నింగ్స్ ఆడాడు.