![Pakistan Cricket Board parts ways with coach Mickey Arthur - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/8/MICKEY-ARTHUR-COACH.jpg.webp?itok=ljzjRHWg)
లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మికీ ఆర్థర్‌కు పొడిగింపు ఇవ్వరాదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది. అతనితో పాటు బౌలింగ్ కోచ్ అజహర్ మహమూద్, బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, ఫిట్‌నెస్ ట్రైనర్ ల్యూడెన్‌లను కూడా పీసీబీ తప్పించనుంది. ఈ నలుగురి కాంట్రాక్ట్ ఈ నెల 15తో ముగుస్తుంది. అయితే ఎవరినీ కొనసాగించకుండా వీలైనంత త్వరలో కొత్త సహాయక సిబ్బందిని ఎంపిక చేస్తామని బోర్డు చైర్మన్ ఎహ్‌సాన్ మణి వెల్లడించారు. వన్డే ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లలో 5 గెలిచిన పాకిస్తాన్ 11 పాయింట్లతో న్యూజిలాండ్‌తో సమంగా నిలిచింది. అయితే రన్‌రేట్‌లో వెనుకబడటంతో సెమీస్ అవకాశం చేజార్చుకుంది. ఆర్థర్ 2016 టి20 ప్రపంచ కప్ తర్వాత పాక్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని పదవీకాలంలో పాక్ వన్డేల్లో చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడం పెద్ద ఘనత కాగా, టి20ల్లో నంబర్‌వన్ జట్టుగా నిలిచింది. ‘పాక్ క్రికెట్‌ను బాగు చేసేందుకు నా శక్తిమేరా ప్రయత్నించాను. తాజా నిర్ణయంతో చాలా బాధపడుతున్నాను’ అని ఆర్థర్ స్పందించాడు.
Comments
Please login to add a commentAdd a comment