పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా పంజాబ్‌ కింగ్స్‌ మాజీ ఆటగాడు | Azhar Mahmood Named Head Coach Of Pakistan For NZ Series | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా పంజాబ్‌ కింగ్స్‌ మాజీ ఆటగాడు

Published Tue, Apr 9 2024 9:47 AM | Last Updated on Tue, Apr 9 2024 10:38 AM

Azhar Mahmood Named Head Coach Of Pakistan For NZ Series - Sakshi

పాకిస్తాన్‌ జాతీయ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా పంజాబ్‌ కింగ్స్‌ మాజీ ఆటగాడు అజహర్‌ మహమూద్‌ ఎంపికయ్యాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ కూడా అయిన అజహర్‌.. పాక్‌ త్వరలో న్యూజిలాండ్‌తో ఆడబోయే టీ20 సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అజహర్‌ను ప్రస్తుతం ఈ సిరీస్‌కు మాత్రమే కోచ్‌గా ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌ సిరీస్‌కు టీమ్‌ మేనేజర్‌గా పాక్‌ మాజీ బౌలర్‌ వహాబ్‌ రియాజ్‌ నియమించబడ్డాడు.

న్యూజిలాండ్‌ సిరీస్‌కు మహ్మద్ యూసుఫ్, సయీద్ అజ్మల్  బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు పాక్‌లో పర్యటింనుంది. ఈ సిరీస్‌ ఏప్రిల్‌ 18, 20, 21, 25, 27 తేదీల్లో జరుగుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లకు రావల్పిండి వేదిక కానుండగా.. ఆఖరి రెండు మ్యాచ్‌లు లాహోర్‌లో జరుగనున్నాయి. ఈ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు ఇదివరకే ప్రకటించబడగా.. పాక్‌ జట్టును ప్రకటించాల్సి ఉంది. 

కాగా, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు గత కొంతకాలంగా ఫుల్‌టైమ్‌ హెడ్‌ కోచ్‌ కోసం అన్వేషిస్తుంది. ఈ పదవిని భర్తీ చేయడం కోసం పీసీబీ పెద్ద కసరత్తే చేసింది. ఒకానొక సమయంలో పాక్‌ హెడ్‌ కోచ్‌గా ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షేన్ వాట్సన్‌ను ఎంపిక చేశారనే ప్రచారం జరిగింది. వాట్సన్‌ పీసీబీ ప్రతిపాదనను తోసిపుచ్చడంతో అజహర్‌ పాక్‌ హెడ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. గ్రాంట్ బ్రాడ్‌బర్న్ నిష్క్రమణ తర్వాత పాక్‌ క్రికెట్‌ జట్టుకు పూర్తి స్థాయి హెడ్‌ కోచ్ లేడు.

ఇదిలా ఉంటే, 49 ఏళ్ల అజహర్‌ మహమూద్‌కు గతంలోనూ కోచింగ్‌ అనుభవం ఉంది. అతను 2017 నుంచి 2019 వరకు పాక్‌ జాతీయ జట్టు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. అజహర్‌ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ కోచింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పాక్‌ తరఫున 21 టెస్ట్‌లు, 143 వన్డేలు ఆడిన అజహర్‌.. 162 వికెట్లు తీసి 2400 పైచిలుకు పరుగులు సాధించాడు. అజహర్‌ టెస్ట్‌ల్లో 3 సెంచరీలు కూడా చేశాడు. 2012-2015 మధ్యలో ఐపీఎల్‌లో పాల్గొన్న అజహర్‌.. పంజాబ్‌ కింగ్స్‌, కేకేఆర్‌ తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో 23 మ్యాచ్‌లు ఆడిన అజహర్‌ 29 వికెట్లు తీసి 388 పరుగులు చేశాడు. అజహర్‌ ఐపీఎల్‌లో 2 హాఫ్‌ సెంచరీలు చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement