పాకిస్తాన్ క్రికెట్ భారీ కుదుపునకు లోనైంది. ఆ జట్టుకు సంబంధించిన ముగ్గురు కీలక వ్యక్తులు తమతమ పదవులకు రాజీనామా చేశారు. పాక్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుటిక్ ఒకేసారి విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పీసీబీతో తమ అనుబంధం ఈ నెలాఖరుతో ముగుస్తుందని ఈ ముగ్గురు వెల్లడించారు.
తమ రాజీనామాలను పాక్ క్రికెట్ బోర్డు కూడా అంగీకరించిందని వారు తెలిపారు. మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, ఆండ్రూ పుటిక్ ఆయా హోదాల్లో గతేడాదే నియమితులయ్యారు. అంతకుముందు కూడా వీరికి పాక్ జట్టుతో అనుబంధం ఉండింది. అయితే వన్డే వరల్డ్‌కప్‌కు ముందు పీసీబీ వీరి పదవులను మార్చింది.
మిక్కీ ఆర్థర్.. గతంలో పాక్ జట్టు హెడ్ కోచ్‌గా.. బ్రాడ్‌బర్న్ ఎన్‌సీఏ హై పెర్ఫార్మింగ్ కోచ్‌గా పని చేశారు. ఈ ఇద్దరు ఆయా పదవుల్లో అద్భుతంగా రాణించి, పాక్ జట్టును అత్యున్నత స్థాయిలో నిలిపారు. అయితే కొత్త పదవుల్లోనే మాత్రం వీరు సత్తా చాటలేకపోయారు. ఆర్థర్ డైరెక్టర్‌గా, బ్రాడ్‌బర్న్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక పాక్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది.
వన్డే వరల్డ్‌కప్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం, ఆ తర్వాత ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ పరాభవం.. తాజాగా న్యూజిలాండ్ చేతిలో టీ20 సిరీస్ ఓటమి.. ఇలా వరుస సిరీస్‌ల్లో పాక్ చెత్త ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డే వీరిని తమ పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించినట్లు తెలుస్తుంది.
వన్డే వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్‌ను మార్చిన పాక్.. తాజాగా ప్రధాన నాన్ ప్లేయింగ్ స్టాఫ్‌ను మార్చడం ఆసక్తికర పరిణామంగా మారింది. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమి నేపథ్యంలో బాబార్ ఆజమ్ పాక్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో పీసీబీ మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించింది.
షాన్ మసూద్ సారథ్యంలోని పాక్ టెస్ట్ జట్టు ఆస్ట్రేలియాలో 0-3తో సిరీస్ కోల్పోయి ఘోర పరాభవాన్ని ఎదుర్కొనగా.. తాజాగా షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని పాక్ టీ20 జట్టు న్యూజిలాండ్ చేతిలో టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో (మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే) కోల్పోయింది. పాక్ ఇవాళ (జనవరి 19) న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment