సస్పెండైన ఇద్దరు క్రికెటర్లు!
కరాచీ:పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్లు షర్జిల్ ఖాన్, ఖలిద్ లతిఫ్ లపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ ఇద్దరిపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) లో వారిద్దరూ స్పాట్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఐసీసీ సహకారంతో విచారణ చేపట్టిన పీసీబీ..వారిద్దరికీ ఫిక్సింగ్ తో సంబంధాలున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఫిక్సింగ్ కు పాల్పడిన ఎటువంటి ఆధారాలను పీసీబీ వెల్లడించలేదు.
తాజాగా సస్పెన్షన్ వేటు పడిన వీరిద్దరూ జాతీయ స్థాయి క్రికెటర్లే. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్ జట్టులో షర్జిల్ సభ్యుడు. అతను పాకిస్తాన్ తరపున ఇప్పటివరకూ 25 వన్డేలు, 15 ట్వంటీ 20లు ఆడాడు. మరొకవైపు గతేడాది వరల్డ్ ట్వంటీ 20 పాల్గొన్న పాక్ జట్టులో లతిఫ్ సభ్యుడు. కేవలం ఐదు వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడిన లతిఫ్..13 ట్వంటీ 20 మ్యాచ్లకు ప్రాతినిథ్యం వహించాడు.