భారత క్రికెటర్‌కు వీరాభిమానిని: పాక్ ప్లేయర్
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ల క్రికెట్ పోరు అంటే చాలు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. దాయాది జట్టులో తమ అభిమాన క్రికెటర్ ఉన్నా.. అయినా ఎందుకొచ్చిన తలనొప్పి అని వారిపై నోరు మెదిపేందుకు ఆలోచిస్తారు. కానీ పాక్ యువ మహిళా క్రికెటర్ కైనత్ ఇంతియాజ్ మాత్రం భిన్నంగా తన మనసులో మాటను బయటపెట్టింది. ఓవైపు మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా మహిళలు 95 పరుగులతో పాక్‌పై విజయం సాధించగా.. మరోవైపు తన ఆరాధ్య క్రికెటర్ ఝులన్ గోస్వామి(భారత్)ని కలుసుకున్నానంటూ కైరత్ హర్షం వ్యక్తం చేసింది.
దాయాదుల పోరులో ఓడిన జట్టుకు నెగ్గిన జట్టుపై తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించడం తరచుగా చూస్తుంటాం. కానీ మ్యాచ్ ముగిసిన అనంతరం భారత వెటరన్ ప్లేయర్ గోస్వామిపై ఆమెకున్న అభిమానాన్ని కైరత్ చాటుకుంది. '2005లో పాకిస్తాన్‌లో జరిగిన ఆసియాకప్‌లో తొలిసారిగా ఝులన్‌ను చూశాను. ఆ సమయంలో ప్రపంచలోనే ఫాస్టెస్ట్ బౌలర్ ఆమె. భారత ఆల్‌రౌండర్ ఝులన్‌ను చూసి ప్రభావితురాలినై ఫాస్ట్ బౌలర్‌గా క్రికెట్ కెరీర్ ఎంచుకున్నాను. పాక్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ ద్వారా.. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత నాకు ఆదర్శప్రాయంగా నిలిచిన ఆరాధ్య క్రికెటర్ ఝులన్‌తో మ్యాచ్ ఆడాను. నా కల నిజమైందని' పేర్కొంటూ భారత పేసర్ ఝులన్ గోస్వామితో కలిసి దిగిన ఫొటోను పాక్ ప్లేయర్ కైనత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.