పాక్ క్రికెట్ లో ఖాన్ కామెంట్స్ దుమారం
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ చేసిన 'డిగ్రీ' వ్యాఖ్యలపై సీనియర్ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెటర్లు చదువులో వెనకబడ్డారని, మిస్బా-వుల్-హక్ మినహా డిగ్రీ చదివాళ్లే లేరని షహర్యార్ కామెంట్ చేశారు.
దీనిపై సీనియర్ బ్యాట్స్ మన్ మహ్మద్ హఫీజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చదువుతో ఆటకు సంబంధం ఏమిటని ప్రశ్నించాడు. క్రికెట్టే తమకు కంప్లీట్ ఎడ్యుకేషన్ అని అన్నాడు. టెస్టు క్రికెటర్ గా చెప్పుకోవడానికి గర్వపడతానని, అదే తన డిగ్రీ అని వ్యాఖ్యానించాడు. అయితే అందరికీ చదువు ముఖ్యమేనని, దీనికి డిగ్రీలే కొలమానం కాదన్నాడు.
పాకిస్థాన్ క్రికెటర్లు చదువును నిర్లక్ష్యం చేస్తున్నారని షహర్యార్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సీనియర్ ఆటగాళ్లు గుర్రుగా ఉన్నారు. అయితే వారు బహిరంగంగా మాట్లాడకుండా, తమ అభిప్రాయాలను పీసీబీ వర్గాలకు రహస్యంగా వెల్లడించినట్టు సమాచారం.