క్యాబ్ డ్రైవర్గా మాజీ క్రికెటర్
భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తే చాలు కోటీశ్వరుడు అయిపోవచ్చు. జీతాలే గాక వాణిజ్య ప్రకటనలు, ఐపీఎల్ వంటి అవకాశాల ద్వారా బోలెడు డబ్బు సంపాదించవచ్చు. అయితే ఇదంతా పార్శ్యంలో ఓ కోణం మాత్రమే. ప్రపంచంలో పేదరికం అనుభవిస్తున్న మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇందుకు పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ అర్షద్ ఖాన్ మరో ఉదాహరణ. అర్షద్ సిడ్నీలో ఉబెర్ టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
పాకిస్థాన్ తరపున అర్షద్ 9 టెస్టులు, 58 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 32, వన్డేల్లో 56 వికెట్లు తీశాడు. 1997-98 సీజన్లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అర్షద్ 2001 వరకు పాక్కు ప్రాతినిధ్యం వహించాడు. అప్పట్లో భారత దిగ్గజాలు సచిన్, ద్రావిడ్ల వికెట్లను తీశాడు. భారత్లో నిషేధిత ఇండియన్ క్రికెట్ లీగ్లో కూడా ఆడాడు. ఇంతటి కెరీర్ ఉన్నా అర్షద్ నేడు ఉపాధి కోసం టాక్సీ డ్రైవర్గా పనిచేయడం ఊహించని విషయం. అర్షద్ ఉదంతాన్ని ఓ భారతీయ నెటిజెన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
'సిడ్నీకి వెళ్లినపుడు అర్షద్ కలిశాడు. తొలుత నేను అతణ్నిగుర్తించలేదు. పాకిస్తానీగా పరిచయం చేసుకున్నాడు. కొంతకాలంగా సిడ్నీలో నివసిస్తున్నానని చెప్పాడు. అతని పూర్తి పేరు అడిగాను. ఆ తర్వాత అతని ముఖం చూసి షాకయ్యాను. అతను పాకిస్థాన్ క్రికెటరని గుర్తించాను. అతని క్యాబ్లో ప్రయాణించినపుడు నీళ్లు, ఆహారపదార్థాలు ఇచ్చాడు. హైదరాబాద్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు' అని నెటిజన్ వెల్లడించాడు.