కరాచీ: ఇటీవల కాలంలో పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడటానికి పలు దేశాలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏ దేశం కూడా అక్కడికి పంపించడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)కు శ్రీకారం చుట్టిన తర్వాత ఆ దేశంలో కాస్త మార్పు కనిపిస్తోంది. పాక్‌లో పీఎస్‌ఎల్‌లో ఆడటానికి పలువురు విదేశీ క్రికెటర్లు ఆసక్తి కనబరచడం ఒకటైతే, కొన్ని రోజుల క్రితం శ్రీలంక కూడా టీ20 సిరీస్ ఆడటానికి పాక్‌లో పర్యటించింది. అయితే ఈ పర్యటనకు శ్రీలంక స్టార్, సీనియర్ క్రికెటర్లు దాదాపు పది మంది దూరమైనప్పటికీ ‘జూనియర్ జట్టు’నే అక్కడికి పంపించీ మరీ ఎస్‌ఎల్‌సీ తమ ఒప్పందాన్ని కొనసాగించింది.
కాగా, పాకిస్తాన్‌లో టెస్టు సిరీస్ జరిగి దాదాపు పదేళ్లు అవుతుంది. ఒక ద్వైపాక్షిక సిరీస్‌ను పాకిస్తాన్‌లో ఆడించాలన్న పీసీబీ కోరిక పరోక్షంగా ఇన్నాళ్లకు నెరవేరింది. తాజాగా పాక్‌లో టెస్టు సిరీస్ ఆడటానికి శ్రీలంక సమాయత్తమైంది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా పాక్‌లో శ్రీలంక టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. దాంతో పాక్‌లో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇరు జట్ల మధ్య జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 11 నుంచి 15 వరకూ రావల్పిండిలో తొలి టెస్టు జరుగనుండగా, డిసెంబర్ 19నుంచి 23 వరకూ కరాచీలో రెండో టెస్టు జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment