తుది పోరులో భారత్ ప్రత్యర్థి పాకిస్తాన్
బ్యాంకాక్:మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నమెంట్ తుది పోరులో భారత్తో పాకిస్తాన్ తలపడనుంది. ఇప్పటికే భారత్ మహిళలు ఫైనల్ కు చేరగా, మరో బెర్తు ఖరారు కోసం చివరి లీగ్ మ్యాచ్ వరకూ వీక్షించాల్సి వచ్చింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో థాయ్లాండ్పై పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ కు అర్హత సాధించింది. తొలుత థాయ్లాండ్ను 51 పరుగులకే కూల్చేసిన పాకిస్తాన్.. ఆ తరువాత లక్ష్య ఛేదనలో ఐదు వికెట్ల మాత్రమే కోల్పోయి 11.4 ఓవర్లలో గెలుపొందింది.
స్వల్ప లక్ష్యాన్ని సాధించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు అయేషా జాఫర్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, బిస్మా మరూఫ్(4) నిరాశపరిచింది. ఆపై అస్మావియా ఇక్బాల్(24), నిదా దార్(14)లు పరిస్థితిన చక్కదిద్దారు. మూడో వికెట్ కు 31 పరుగులు జోడించి పాక్ కు విజయాన్ని ఖరారు చేశారు. ఈ టోర్నీలో భారత్ ఐదు వరుస విజయాలతో ఫైనల్ కు చేరగా, పాకిస్తాన్ నాలుగు విజయాలతో తుది పోరుకు చేరింది. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. అంతకుముందు ఇరు జట్ల మధ్య లీగ్ మ్యాచ్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.