
పాక్, లంకతో ముక్కోణపు టోర్నీ!
చెన్నై: దక్షిణాఫ్రికా పర్యటనకు బీసీసీఐ దాదాపుగా ముగింపు పలికే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే ఈ టూర్ స్థానంలో తాజాగా పాకిస్థాన్, శ్రీలంకతో ముక్కోణపు టోర్నీ జరపాలని బోర్డు భావిస్తోంది. ఈ మేరకు శనివారం ఇక్కడ జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశానికి ఏసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్.శ్రీనివాసన్ హాజరయ్యారు. నవంబర్, డిసెంబర్ లో జరగాల్సిన సఫారీ పర్యటనలో తమకు సమాచారం ఇవ్వకుండానే సుదీర్ఘ షెడ్యూల్ ప్రకటించడంపై భారత క్రికెట్ బోర్డు ఆగ్రహంతో ఉంది. దీంతో నవంబర్‌లో విండీస్‌తో సిరీస్‌ను ఖాయం చేసుకుంది. జనవరి 19 నుంచి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. సోమవారం బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్, దక్షిణాఫ్రికా క్రికెట్ చీఫ్ హరూన్ లోర్గాత్‌తో దుబాయ్‌లో జరిగే సమావేశం అనంతరం ఈ ముక్కోణపు టోర్నీ గురించి పూర్తి స్పష్టత రానుంది.
బంగ్లాదేశ్‌లో ఆసియా కప్
వచ్చే ఫిబ్రవరి 24 నుంచి మార్చి 8 వరకు ఆసియా కప్ టోర్నీ బంగ్లాదేశ్‌లో జరుగనుంది. వాస్తవానికి ఈ టోర్నీ భారత్‌లో జరగాల్సి ఉన్నా అంతర్జాతీయ బిజీ షెడ్యూల్ కారణంగా బంగ్లాదేశ్‌కు వెళ్లింది. అయితే గత టోర్నీ (2012లో) కూడా అక్కడే జరగడం విశేషం.