మెల్‌బోర్న్: వచ్చే నెలలో దక్షిణాఫ్రికా గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో తలపడాల్సిన ఆస్ట్రేలియా జట్టు ఆ పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకుంది. సమీప భవిష్యత్తులో ఎలాంటి తేదీలు కూడా ప్రకటించకపోవడంతో ఈ టెస్టు సిరీస్ దాదాపుగా రద్దయినట్లే. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఈ టూర్ కోసం ఇప్పటికే జట్టును కూడా ప్రకటించిన కంగారూ టీమ్ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
అదే కారణమా...
అయితే ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన రద్దు విషయంలో కరోనాకంటే కూడా ఇతర విషయాలు కారణమని వినిపిస్తోంది. భారత్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి ఆ జట్టు కోలుకోలేదు. పైగా ఆటగాళ్లకు, కోచ్ లాంగర్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. ప్రస్తుత స్థితిలో రబడ, నోర్జే, ఇన్‌గిడిలాంటి బౌలర్లను ఎదుర్కొని అక్కడ గెలవడం సులువు కాదు.
మరొక్క సిరీస్ ఓడినా టీమ్ మేనేజ్‌మెంట్‌లో సమూల మార్పులు ఖాయమనే భావన అందరిలో ఉండటమే వెళ్లకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కరోనా కాలంలోనూ ఇటీవల దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకకు ఆతిథ్య మిచ్చింది. ఇరు జట్ల మధ్య బయో బబుల్‌లో రెండు టెస్టులు జరిగాయి. అవే ఏర్పాట్లు ఇప్పుడు చేయడం కూడా కష్టం కాదు. మరో వైపు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు పర్యటన కూడా సాఫీగా కొనసాగుతోంది.
పాపం ఆసీస్!
ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలకు భారత్‌తో సిరీస్ సందర్భంగా దెబ్బ పడింది. మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టుకు జరిమానాతో పాటు ఐసీసీ నాలుగు పాయింట్ల కోత కూడా విధించింది. అది జరగకపోయి ఉంటే ఆస్ట్రేలియా కూడా న్యూజిలాండ్‌తో సమంగా 70 పాయింట్ల శాతంతో ఉండేది. అప్పుడు ఒక్కో వికెట్‌కు చేసిన పరుగులు, ఇచ్చిన పరుగుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చేది. ఈ అంశంలో కివీస్ (1.28) కంటే మెరుగ్గా ఉన్న ఆసీస్ (1.39)కు మంచి అవకాశం ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment