
మన్సూర్ అహ్మద్... పాకిస్తాన్ హాకీ సూపర్‌స్టార్స్‌లో ఒకడు. 14 ఏళ్ల కెరీర్‌లో గోల్‌కీపర్‌గా 338 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అతను పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన 1994 ప్రపంచ కప్ ఫైనల్లో చివరి పెనాల్టీని అద్భుతంగా ఆపి జట్టును చాంపియన్‌గా నిలపడంతో అతను జాతీయ హీరోగా మారిపోయాడు. ఆసియా క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీల్లో పతకాలు, 1992 బార్సిలోనా ఒలింపిక్స్ కాంస్యం కూడా అతని ఖాతాలో ఉన్నాయి. అయితే ఇంత ఉజ్వలమైన కెరీర్ తర్వాత కూడా ఆర్థికపరంగా మన్సూర్ పరిస్థితి గొప్పగా లేదు. చాలా మంది క్రికెటేతర ఆటగాళ్లలాగే అతనూ ఓ మోస్తరు సంపాదనతోనే గడిపేశాడు. అయితే కొన్నాళ్ల నుంచి హృదయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ మన్సూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అరుదైన ఈ వ్యాధి కోసం ఆస్పత్రి వర్గాలు రూ.15 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశాయి! సొంత డబ్బు ఇప్పటికే దాదాపుగా ఖర్చు పెట్టేయగా, పాక్ హాకీ సమాఖ్య కొంత సహకరించింది.
అయితే ఇప్పుడు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది. ఈ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షాహిద్ ఆఫ్రిది నేనున్నానంటూ ముందుకొచ్చాడు. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా అతను మన్సూర్‌ను ఆదుకునేందుకు సిద్ధమయ్యాడు. ‘మన్సూర్‌లాంటి దిగ్గజాన్ని ఇలాంటి స్థితిలో చూస్తూ ఊరుకోలేం. ఆయన మంచి చికిత్స తీసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే వరకు షాహిద్ ఆఫ్రిది ఫౌండేషన్ అన్ని ఖర్చులూ భరిస్తుంది’ అని ఆఫ్రిది ప్రకటించాడు. సహజంగానే పాకిస్తాన్‌లో క్రీడాకారుల ఆదాయం అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఆర్జనపరంగా పాక్‌లో నంబర్‌వన్ స్పోర్ట్స్‌మన్ అయిన ఆఫ్రిది మరో ఆటగాడికి సహకరించేందుకు ముందుకు రావడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.