పాకిస్తాన్ ఘనవిజయం
తొలి టెస్టులో ఇంగ్లండ్ చిత్తు
లార్డ్స్: ఇంగ్లండ్ గడ్డపై పాకిస్తాన్ చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ఆదివారం ఇక్కడ ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ 75 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ నాలుగో రోజు 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకే ఆలౌటైంది. బెయిర్ స్టో (48), బ్యాలెన్స్ (43), విన్స్ (42) ఓ మోస్తరుగా ఆడారు. 139 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోగా... బెయిర్ స్టో, వోక్స్ (23) ఏడో వికెట్‌కు 56 పరుగులు జోడించి పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. పాక్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా 4 వికెట్లతో మరోసారి ప్రత్యర్థిని కుప్పకూల్చాడు.
రాహత్ అలీ 3, ఆమిర్ 2 వికెట్లు తీశారు. మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టిన యాసిర్ షా (10/141)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో రెండో టెస్టు శుక్రవారం నుంచి మాంచెస్టర్‌లో జరుగుతుంది. 2010లో లార్డ్స్ టెస్టులోనే స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం బయటపడిన తర్వాత ఆరేళ్లకు ఇప్పుడు ఇదే మైదానంలో పాకిస్తాన్ మళ్లీ బరిలోకి దిగడంతో తొలి టెస్టుకు ఆరంభంనుంచే ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.