భారత్ నుంచి పాక్ ఎలాగైనా సాధిస్తుంది!
పాకిస్తాన్ తో భారత్ టెస్టులు ఆడకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని పాక్ క్రికెట్ చీఫ్ సెలక్టర్, మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు. టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్ న్ వెనక్కినెడుతూ భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. దీనిపై ఇంజీ స్పందిస్తూ.. భారత్ తో మ్యాచ్ లు లేకపోతేనేం.. మాకేం నష్టం లేదు. ఇతర జట్లపై పాక్ విజయాలు సాధించి భారత్ నుంచి అగ్రస్థానాన్ని తిరిగి లాగేసుకుంటామని ధీమా వ్యక్తంచేశాడు.
భారత్ తో వన్డే, టెస్టు సిరీస్ లు ఆడిన పాక్ జట్టుకు తాను కెప్టెన్ గా వ్యవహరించానని, ఈ మ్యాచ్ లు ఎంతముఖ్యమో తనకు తెలుసునన్నాడు. భారత్ స్వదేశంలో త్వరలో మరో 13 టెస్టులు ఆడనుండగా, తమ జట్టు మాత్రం 2009 నుంచి స్వదేశంలో మ్యాచ్ ఆడటంలేదని ఇంజమామ్ వాపోయాడు. భారత్ విదేశాల్లో సిరీస్ లు నెగ్గలేదని, పాక్ మాత్రం ఎక్కడైనా రాణిస్తుందని చెప్పాడు. ఇంగ్లండ్ లో భారత్ ఓటమిపాలైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. పాక్ కేవలం ఆస్ట్రేలియా గడ్డపైనే ఇబ్బందులు ఎదుర్కొంటుందని వివరించాడు.