బైక్‌పై మహిళా క్రికెటర్..
లాహోర్: పాకిస్థాన్‌లో క్రికెట్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో..అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రపంచకప్ టోర్ని నుంచి నిష్క్రమించిన పాక్ మహిళా జట్టుకు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంటికి వెళ్లడానికి కనీస సౌకర్యం కల్పించలేదు. బౌలర్ నష్రా సంధుకు లాహోర్ ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళ్లే సౌకర్యం కల్పించకపోవడంతో ఆమె చేసేది ఏమి లేక కుటుంబ సభ్యుని బైక్‌పై ఇంటికి వెళ్లింది. ఇది కాస్త సామా టీవీ చానెల్ ప్రసారం చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. పాక్ క్రికెట్ అభిమానులంతా పీసీబీపై మండిపడుతుండగా భారత అభిమానులు మాత్రం ఎవరి చేసుకున్న కర్మ వారిదే అని కశ్మీర్ పరిస్థితి ఉద్ధేశించి కామెంట్లు చేస్తున్నారు.
పాక్ పురుషుల జట్టు చాంపియన్స్ ట్రోఫీ నెగ్గి మాతో క్రికెట్ ఆడటానికి మా దేశానికి రండి అని విజ్ఞప్తి చేసినా టాప్ ర్యాంకులో ఉన్న ఏ జట్లు పాక్‌లో ఆడటానికి సుముఖత చూపకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గడ్డు కాలాన్ని ఎదురుకుంటోంది. ఇక పాక్ మహిళా క్రికెటర్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇప్పుడిప్పుడే మహిళల క్రికెట్ ఆదరణ పొందుతుండగా పాక్ మహిళల జట్టు మాత్రం ప్రపంచకప్‌లో దారుణంగా ఓటమిపాలైంది. ఆడిన ఏడు మ్యాచుల్లో ఒక్కటి గెలవకుండా టోర్ని నుంచి నిష్క్రమించింది. ఇక పీసీబీ నుంచి వీరికి ఎలాంటి ఆదరణ లేదు. ఘోర వైఫల్యాల కారణంగా పాక్ మహిళా జట్టు కెప్టెన్ సనామిర్‌పై వేటుపడింది. కెప్టెన్సీ నుంచి పీసీబీ ఆమెను తప్పించింది.