జీవిత కాల నిషేధం విధించాల్సిందే:ఆమిర్
కరాచీ: మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిన క్రికెటర్లకు జీవిత కాల నిషేధం విధించడమే సబబని గతంలో ఫిక్సింగ్ కు పాల్పడిన పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్ స్పష్టం చేశాడు. మ్యాచ్ ఫిక్సర్లకు జీవిత కాల నిషేధమే తగిన శిక్షని ఇటీవల ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ చేసిన వ్యాఖ్యలకు ఆమిర్ మద్దతు తెలిపాడు. క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే వారిపై జీవిత కాలం నిషేధం విధించడం ఒకటే సరైన మార్గమన్నాడు.
తాను కూడా ఫిక్సింగ్ కు పాల్పడిన తరువాత అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేస్తానని అస్సలు అనుకోలేదని తన చేదు జ్ఞాపకాల్ని ఆమిర్ గుర్తు చేసుకున్నాడు. మళ్లీ తాను టెస్టు క్రికెట్ ఆడటం నిజంగా అదృష్టమేనన్నాడు. ఇంకా ఇప్పటికే తన పునరాగమనం నమ్మశక్యంగా లేదన్నాడు. తన టెస్టు క్రికెట్ జీవితం తిరిగి ఇంగ్లండ్లోని ప్రారంభం కావడంపై ఆమిర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ తో సిరీస్కు ఆతృతగా ఉన్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.
2010లో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడిన ఆమిర్ ఐదు సంవత్సరాల పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. ఇటీవల పాక్ జట్టులో పునరాగమనం చేసిన ఈ స్టార్ పేసర్ ఆసియా కప్లో రాణించి అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో అతని ఇంగ్లండ్ వెళ్లే పాక్ జట్టులో స్థానం కల్పించారు.