క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ముగిసి వారం రోజులు గడుస్తున్నా.. అవార్డుల ఎంపిక మీద విమర్శలు మాత్రం తగ్గటం లేదు. ఇప్పటికే టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఖేల్ రత్న అవార్డు ఇవ్వడంపై పలువురు క్రీడాకారులు విమర్శలు గుప్పించారు. దీనిపై కర్నాటక రాష్ట్రానికి చెందిన పారాలంపియన్ హెచ్ ఎన్ గిరీష ఏకంగా కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే.. తాజాగా.. ఇండియన్ స్టార్ స్నూకర్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్రీడా అవార్డుల ఎంపిక పై విమర్శనాస్త్రాలు సంధించాడు.
ఎంపిక పారదర్శకంగా జరగటం లేదని.. ఎంపిక కమిటీ పారదర్శకంగా వ్యవహరించడం లేదని అన్నాడు. కేంద్ర క్రీడా శాఖ అవార్డుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన మార్గదర్శకాల్లో స్పష్టత లేమే దీనికి కారణమని అభిప్రాయపడ్డాడు. దీనికి సానియా మీర్జా ఉదంతాన్నే వివరించాడు. ఎంపిక కమిటీ ఏర్పాటు చేసిన పాయింట్ల ఆధారంగా.. పారాలంపియన్ గిరీష.. సానియా మీర్జా కంటే ఎంతో ముందు ఉన్నాడని చెప్పుకొచ్చాడు. అయితే పాయింట్ల వ్యవస్థ సరిగా లేక పోవడమే ఇందుకు కారణమని అన్నాడు.
మరో వైపు గిరీష సైతం ఇదే అంశాన్ని సవాలు చేస్తూ ఖేల్ రత్న అవార్డుపై కోర్టు కెక్కాడు. అవార్డుల కమిటీ ఇచ్చిన మార్గ దర్శకాల్లో ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ప్రపంచ కప్ లు, ఛాంపియన్ షిప్ లలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే అవార్డులు అందుకునే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని రెజ్లింగ్ కోచ్ వినోద్ కుమార్ పేర్కొన్నాడు.
అయితే ఖేల్ రత్నకు వ్యతిరేకంగా పంకజ్ వ్యాఖ్యలు మీడియాలో ఒక్కరోజు కూడా గడవక ముందే పంకజ్ తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చాడు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ టెన్నిస్ లో సానియా ఆటతీరును తక్కువ చేసిన చూడలేమని.. ఖేల్ రత్నకు ఆమె అర్హురాలేనని అన్నాడు. ఐయామ్ హ్యాపీ ఫర్ సానియా అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ట్వీట్ చేయడం విశేషం. తన విమర్శ కేవలం కేంద్ర క్రీడాశాఖ, అవార్డుల ఎంపిక కమిటీ పారదర్శకత మీదనే అని వివరణ ఇచ్చుకున్నాడు.
అంతే కాదు పంకజ్ అవార్డుల కమిటీ లోపాలను చూపుతూ.. మహిళా స్నూకర్ క్రీడాకారిణి విద్యా పిళ్లై ఉదంతాన్ని వివరించాడు. అంతర్జాతీయ స్థాయిలో లెక్కలేనన్ని మెడల్స్, ట్రోఫీలు గెలుచుకున్నా.. ఇప్పటి వరకూ ఆమెను అర్జున అవార్డుకు కూడా ఎంపిక చేయకపోవటం పట్ల అసంతృప్తిని వ్యక్తంచేశాడు.
క్రీడాఅవార్డులు ప్రకటించిన ప్రతి సందర్భంలోనూ ఇలాంటి దుమారాలు చలరేగటం సాధారణమే అయినా.. ఖేల్ రత్న వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేట్లు లేదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
ఖేల్ రత్న మీద విమర్శలెక్కుపెట్టిన పంకజ్ అద్వానీ
Published Thu, Sep 3 2015 3:49 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM
Advertisement
Advertisement