పార్థీవ్ అవుట్
న్యూఢిల్లీ:బంగ్లాదేశ్తో జరగబోయే ఏకైక టెస్టు మ్యాచ్కు సంబంధించి భారత వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్కు నిరాశే ఎదురైంది. మంగళవారం ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన భారత టెస్టు జట్టులో పార్థీవ్ పటేల్ కు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్లో పార్థీవ్ రాణించినప్పటికీ అతని తాజా ఎంపికపై సెలక్టర్లు మొగ్గు చూపలేదు. కాగా, తమిళనాడు ఆటగాడు అభినవ్ ముకుంద్కు అనూహ్యంగా చోటు దక్కింది. 2011 జూలై నెలలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో ముకుంద్ చివరిసారి ఆడాడు.
ఇదిలా ఉండగా భారత జట్టులో మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహాలు తిరిగి చోటు దక్కించుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం గాయం కారణంగా జట్టుకు దూరమైన ఈ ఇద్దరూ ఫిట్నెస్ పరీక్షలో పాస్ కావడంతో వారికి స్థానం కల్పించారు. వచ్చే నెల తొమ్మిదో తేదీన ఇరు జట్ల మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఏకైక టెస్టు మ్యాచ్ జరుగనుంది.
భారత ఎంపిక చేసిన జట్టు ఇదే: విరాట్ కోహ్లి(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, అజింక్యా రహానే, కరుణ్ నాయర్, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా, అభినవ్ ముకుంద్, హార్దిక్ పాండ్యా