పిచ్‌ ఎవరికి అనుకూలం? మార్పులు ఎందుకు చేశారు? | Pitch for India Aus match changed to turning track on hosts request | Sakshi
Sakshi News home page

పిచ్‌ ఎవరికి అనుకూలం? మార్పులు ఎందుకు చేశారు?

Published Sun, Mar 27 2016 11:25 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

పిచ్‌ ఎవరికి అనుకూలం? మార్పులు ఎందుకు చేశారు?

టీ20 వరల్డ్‌ కప్‌లో మరో ప్రతిష్టాత్మక పోరు కోసం మొహాలి సిద్ధమైంది. సెమిస్‌ బరిలోని నిలువాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో భారత్‌ ఆస్ట్రేలియాతో తలపడుతున్నది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టుకు మేలు చేసేలా మొహాలీ పిచ్‌లో మార్పులు చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. టీమిండియా మేనేజ్‌మెంట్ సూచన ప్రకారం టర్నింగ్ ట్రాక్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం.

'పాకిస్థాన్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ కోసం సిద్ధం చేసిన తరహా పిచ్‌నే మొదట అనుకున్నాం. కానీ టీమిండియా ఈ రకమైన పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్పులు చేయాల్సిందిగా సూచించింది. దీంతో వారు కోరినట్టుగా స్పిన్‌కు, కొద్దిగా బౌన్స్‌కు దోహదపడే పిచ్‌ను రెడీ చేశాం' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నిజానికి నాగ్‌పూర్‌ పిచ్‌ విషయంలోనూ ఇలాంటి  పరిణామమే జరిగింది. భారత టీమ్ మేనేజ్‌మెంట్ సూచన ప్రకారం నాగ్‌పూర్ పిచ్‌లోనూ మార్పులు చేశారు. అయితే న్యూజిలాండ్ స్పిన్నర్లు మిచేల్ సాంట్నర్‌, ఐష్ సోధీ రాణించడంతో ఈ వ్యూహం బెడిసికొట్టింది. టీమిండియా దారుణంగా ఓడింది.

సహజంగా స్వదేశంలో సిరీస్‌లు జరుగుతున్నప్పుడు ఆతిథ్య జట్టు సూచనల మేరకు పిచ్‌ సిద్ధం చేయడం మామూలు విషయమే. కానీ, ఐసీసీ పెద్ద టోర్నమెంట్లలో ఆతిథ్యమిస్తున్న జట్టు ఇష్టానుసారంగా పిచ్‌ మార్చడం కుదరదు. ఐసీసీ నియమించిన క్యూరెటర్ సూచన మేరకు పిచ్‌ సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు క్రికెట్‌ను నడిపిస్తున్నది కేవలం డబ్బే. ఆ డబ్బు దండిగా రావాలంటే ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్‌ ఎక్కువగా ముందుకువెళ్లి ఆడాలి. టీమిండియా ముందుకువెళ్లినప్పుడే టీవీ ప్రసారాల ద్వారా దండిగా సొమ్ము అందుతుంది. ఆ డబ్బే అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులకు కావాల్సిన ఊతమిస్తుంది. కాబట్టే ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఇండియా గెలిచేందుకు ఆర్థికంగా బలంగా ఉన్న బీసీసీఐ తన వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వినిపిస్తోంది. పిచ్‌ మార్చినా మార్చకున్నా.. ఆటగాళ్లు బాగా ఆడిన జట్టే విజయం సాధిస్తుందని నిపుణులు అంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement