వికెట్ తీసిన ఆనందంలో భారత ఆటగాళ్లు
అరుదైన సందర్భం... అద్భుత అవకాశం... కావాల్సినంత సమయం... ఆత్మరక్షణలో ప్రత్యర్థి... ఊరిస్తున్న విజయం! మూడో టెస్టు ఇప్పుడు పూర్తిగా భారత్ చేతుల్లో! తొలి ఇన్నింగ్స్‌లోలాగా బౌలర్లు చెలరేగితే చాలు... గెలుపు మన ఖాతాలో పడిపోతుంది! సిరీస్‌కు మంచి ముగింపునిచ్చినట్లు అవుతుంది.
జొహన్నెస్‌బర్గ్: మ్యాచ్‌లో ఇరు జట్లూ సమఉజ్జీగా నిలిచిన వేళ... అత్యంత కఠిన పరిస్థితుల్లో, అదీ రెండో ఇన్నింగ్స్‌లో, ఆపై విదేశీ గడ్డపై భారత్ బ్యాట్స్‌మెన్ అసాధారణంగా ఆడారు. మిడిలార్డర్‌లో అజింక్య రహానే (68 బంతుల్లో 48; 6 ఫోర్లు), కెప్టెన్ కోహ్లి (79 బంతుల్లో 41; 6 ఫోర్లు)లకు తోడు లోయరార్డర్‌లో భువనేశ్వర్ (76 బంతుల్లో 33; 2 ఫోర్లు), షమీ (28 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు) బ్యాట్ ఝళిపించడంతో మూడో రోజు టీమిండియా 247 పరుగులకు ఆలౌటైంది. ప్రొటీస్‌కు 241 పరుగుల లక్ష్యం విధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్ (3/61), మోర్కెల్ (3/47), రబడ (3/69) రాణించారు. బంతి అసహజంగా బౌన్స్ అవుతున్న వాండరర్స్ పిచ్‌పై కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలో దిగిన సఫారీ జట్టు... పిచ్ పరిస్థితిరీత్యా ఆట నిలిపివేసే సమయానికి వికెట్ నష్టపోయి 17 పరుగులు చేసింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (11 బ్యాటింగ్), ఆమ్లా (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జట్టు చేతిలో 9 వికెట్లుండగా... మరో 224 పరుగులు చేయాల్సి ఉంది. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో... ప్రత్యర్థి అసాధారణ పోరాటం చేస్తే తప్ప ప్రస్తుతానికి జొహన్నెస్‌బర్గ్ టెస్టులో మన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
విజయ్ ఓర్పు... కోహ్లి నేర్పు...
ఓవర్‌నైట్ స్కోరు 49/1తో శుక్రవారం ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియాను తొలి సెషన్‌లో కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ మురళీ విజయ్ (127 బంతుల్లో 25) నిలబెట్టారు. ముఖ్యంగా విజయ్ బంతి పాతబడేలా అత్యంత ఓర్పు చూపాడు. అవతలివైపు కోహ్లి చక్కటి డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ (16), డిపెండబుల్ పుజారా (1) త్వరగానే వెనుదిరగడంతో 57/3తో కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరూ 43 పరుగులు భాగస్వామ్యంతో ఆదుకున్నారు. అయితే... లంచ్‌కు ముందు ఓవర్లో రబడ యార్కర్‌కు విజయ్ బౌల్డయ్యాడు.
రహానే, భువీ మెరుపులు...
లంచ్ తర్వాత కెప్టెన్‌తో కలిసిన రహానే అచ్చమైన టెస్టు షాట్లు ఆడుతూ తన విలువేంటో చూపాడు. అవతలి వైపు కోహ్లి పట్టుదలగా కనిపించాడు. అయిదో వికెట్‌కు 34 పరుగులు జతయ్యాక... అతడిని రబడ అద్భుత బంతితో అవుట్ చేశాడు. వెంటనే హార్దిక్ పాండ్యా (4) మరోసారి పేలవ షాట్‌కు వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 148/6. ఆధిక్యం 141 మాత్రమే. ఈ సమయంలో భువీ తోడుగా రహానే ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరు ప్రొటీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. డీప్ పాయింట్‌లో ఎల్గర్ క్యాచ్ వదిలేయడంతో రహానే బతికిపోయాడు. ఈ ఇద్దరూ బంతిని ఖాళీల్లోకి కొడుతూ ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోయారు. భువీ అయితే తడబాటు అనేదే లేకుండా టాపార్డర్ బ్యాట్స్‌మన్‌ను తలపించాడు. తొలి ఇన్నింగ్స్‌లోలానే కీలకమైన పరుగులు జోడించాడు. టీ వరకు వీరు మరో వికెట్ పడకుండా చూసుకున్నారు.
షమీ దూకుడు...
విరామం అనంతరం జట్టు స్కోరు 200 దాటించాక మోర్కెల్ ఓవర్లో లెగ్‌సైడ్ ఆడబోయిన రహానే... కీపర్ డికాక్ పట్టిన ఫుల్ లెంగ్త్ డైవ్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో 53 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇన్నింగ్స్‌కు తెరపడేందుకు మరెంతో సేపు పట్టదనుకుంటుండగా షమీ మెరుపులు మెరిపించాడు. దూకుడుగా కనిపించిన అతడు రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. ఈ టెస్టులో తొలి సిక్స్ షమీదే కావడం విశేషం. అయితే స్క్వేర్‌లెగ్ మీద డివిలియర్స్‌ను ఉంచి ఇన్‌గిడి షమీని బుట్టలో పడేశాడు. భువీ... మోర్కెల్ షార్ట్ పిచ్ బంతికి కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా, బుమ్రా (0)ను ఫిలాండర్ అవుట్ చేయడంతో ఇన్నింగ్స్ ముగిసింది. ఇషాంత్ (7) నాటౌట్‌గా మిగిలాడు. ఈసారి ప్రొటీస్ బౌలర్లు 29 అదనపు పరుగులు ఇచ్చారు. భారత ఇన్నింగ్స్‌లో ఇది నాలుగో అత్యధిక స్కోరు కావడం విశేషం.
వికెట్ పడింది... ఆట ముందే ఆగింది...
పిచ్ పరిస్థితి దృష్ట్యా నాలుగో ఇన్నింగ్స్‌లో కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టుకు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి పంపిన ఓపెనర్ మార్క్‌రమ్ (4) మరెంతో సేపు నిలవలేదు. రెండో ఓవర్లో షమీ బౌలింగ్‌లో పార్థివ్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం 6 ఓవర్లపైగా ఆట సాగింది. ఈ నేపథ్యంలో అరగంట పైగా ఆట ఉండి... అంతా మరో వికెట్ గురించి ఆలోచిస్తుండగా 8వ ఓవర్లో ఛేంజ్ బౌలర్‌గా బుమ్రా వచ్చాడు. అతడు వేసిన తొలి మూడు బంతులు అనూహ్యంగా పైకి లేచాయి. మూడో బంతి ఏకంగా ఎల్గర్ హెల్మెట్‌ను బలంగా తాకింది. దీంతో అతడు ఐస్ పెట్టుకోవాల్సి వచ్చింది. పరిస్థితిని గమనించి మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ మైదానంలోకి వచ్చి అంపైర్లతో చర్చించాడు. అనంతరం ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
వామ్మో పిచ్
పచ్చికతో కళకళలాడే వాండరర్స్ పిచ్ అంటే పేసర్లు పండుగ చేసుకుంటారు. దీనికి తగ్గట్లే తొలి రెండు రోజులు ఒకటి రెండు బంతులు భారీగా బౌన్స్ అయినా సహజమని భావించారు. కానీ... శుక్రవారం పిచ్ మరీ ప్రమాదకరంగా కనిపించింది. గుడ్ లెంగ్త్, షార్ట్ లెంగ్త్ ప్రదేశాల్లో నెర్రెలు బారి అసహజ బౌన్స్‌తో తొలి సెషన్ నుంచే బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపింది. రబడ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 31వ ఓవర్లో కోహ్లి కుడి చేతిని, 35వ ఓవర్లో విజయ్ ఎడమ చేతిని బంతులు గట్టిగా తాకాయి. దీనిపై కోహ్లి, అంపైర్లు ఒకసారి చర్చించారు కూడా. మళ్లీ ఇలాగే జరగడంతో ఇరు జట్ల కెప్టెన్లు, అంపైర్లు సుదీర్ఘంగా సంభాషించుకున్నారు. తర్వాత కూడా రహానే మోచేయి, గ్లోవ్స్‌కు తగిలింది. చివరకు ఎల్గర్ హెల్మెట్ గ్రిల్స్‌ను బంతి తాకిన పరిస్థితి చూసి తీవ్రత తెలిసింది. విండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మైకేల్ హోల్డింగ్ అయితే... బ్యాట్స్‌మెన్ తీవ్రంగా గాయపడే ఇలాంటి పిచ్‌కు 2 మార్కులు కూడా ఇవ్వనని ప్రకటించాడు. మరోవైపు రెండు జట్ల ఆటగాళ్లకు తక్షణ వైద్యం అందించేందుకు తరచూ ఫిజియోలు రావడంతో... వాండరర్స్‌లో వారికి పని దొరికిందనే వెటకారం వ్యాఖ్యలు వచ్చాయి. శుక్రవారం ఆటను తొందరగానే ముగించడంతో మ్యాచ్ కొనసాగుతుందా లేదా అనే సస్పెన్స్ కొంచెం సేపు కొనసాగింది. అయితే రిఫరీ, అంపైర్లు, రెండు జట్ల కెప్టెన్‌ల మధ్య చర్చల అనంతరం శనివారం యధావిధిగా ఆటను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికార ప్రకటన విడుదలైంది.
వికెట్ స్పోర్టివ్‌గా ఉంది...
ఇది రెండు జట్లకూ అవకాశాలున్న చాలెంజింగ్ పిచ్. బౌన్స్ ప్రమాదకరంగా ఏమీ లేదు. ఈ తరహాలో రూపొందించాలని మేమైతే కోరలేదు. ఆట సాగాలనే అనుకున్నాం. ఎల్గర్‌కు తగిలిన బంతి బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌లో పడింది. అందుకని అదనపు బౌన్స్ కంటే కొంచెం ఎక్కువగా స్పందించింది. మా టెయిలెండర్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి బౌలర్లు బౌన్సర్లు వేశారు కదా? కొత్త బంతితో ఆడటం సవాలే కానీ ప్రమాదకరం కాదు.
– భారత వైస్ కెప్టెన్ రహానే
Comments
Please login to add a commentAdd a comment