అరుంధతి మెరిస్తే.. పూనమ్‌ తిప్పేసింది..! | Poonam, Arundhati Shared 5 Wickets Help To India's Win | Sakshi
Sakshi News home page

అరుంధతి మెరిస్తే.. పూనమ్‌ తిప్పేసింది..!

Published Mon, Feb 24 2020 8:19 PM | Last Updated on Mon, Feb 24 2020 8:19 PM

Poonam, Arundhati Shared 5 Wickets Help To India's Win - Sakshi

పెర్త్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌-ఎలో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 18 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ మరోసారి తన మ్యాజిక్‌ను ప్రదర్శించింది. మూడు వికెట్లు సాధించి బంగ్లాదేశ్‌ కష్టాల్లోకి నెడితే,  హైదరాబాద్‌ పేసర్‌ అరుంధతి రెడ్డి రెండు వికెట్లతో మెరిసింది. ఇక శిఖా పాండే కూడా రెండు వికెట్లతో ఆకట్టుకోవడంతో భారత్‌ సునాయాసంగా విజయం సాధించింది. రాజేశ్వరి గైక్వాడ్‌కు వికెట్‌ లభించింది. 

భారత్‌ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ ఐదు పరుగుల వద్ద ఓపెనర్‌ షమీనా సుల్తానా(3) వికెట్‌ను కోల్పోయింది. రెండో ఓవర్‌ తొలి బంతికి షమీనాను ఔట్‌ చేసి శిఖా పాండే మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఆపై ముర్షిదా ఖతున్‌(30)ను అరుంధతి రెడ్డి ఔట్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ 44 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో పూనమ్‌ యాదవ్‌ తన స్పిన్‌ మాయాజాలంతో బంగ్లాదేశ్‌ను వణికించింది. ఈ క్రమంలోనే సంజిదా ఇస్లామ్‌(10)ను పూనమ్‌ ఔట్‌ చేయగా, ఫర్గానా హాక్‌ను అరుంధతి డకౌట్‌గా పెవిలియన్‌కు పంపడంతో బంగ్లాపై ఒత్తిడి పెరిగింది. అటు తర్వాత ఫహిమా ఖతున్‌(17), జహనారా అలామ్‌(10)లను వరుస విరామాల్లో పూనమ్‌ ఔట్‌ చేయగా నిగార్‌ సుల్తానా(35) ప్రమాదకరంగా మారిన తరుణంలో రాజశ్వేరి వికెట్‌ను తీసింది. ఇలా బంగ్లాదేశ్‌ను కడవరకూ ఒత్తిడిలోకి నెట్టడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. (ఇక్కడ చదవండి:10కే మూడు వికెట్లు.. కానీ ఈసారి వదల్లేదు!)

ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. యువ క్రీడాకారిణి షెషాలీ వర్మ(39; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4సిక్స్‌లు) ధాటిగా ఆడితే, రోడ్రిగ్స్‌(34; 37 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకుంది. చివర్లో వేదా కృష్ణమూర్తి( 20 నాటౌట్‌;11 బంతుల్లో 4 ఫోర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది. కెప్టెన్‌ హర‍్మన్‌ప్రీత్‌ కౌర్‌(8) మరోసారి నిరాశపరిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement