ప్రాక్టీస్ మ్యాచే కావచ్చు... కానీ ప్రమాద ఘంటిక మోగించింది... పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించవచ్చు... కానీ పదునైన స్వింగ్ పని చేస్తే మన పరిస్థితి ఏమిటో చూపించింది... పచ్చికతో నిండిన పిచ్, మేఘావృత వాతావరణంలో పేసర్లు ట్రెంట్ బౌల్ట్, నీషమ్ చెలరేగిన వేళ భారత బ్యాటింగ్ కుప్పకూలింది.
బౌల్ట్ దెబ్బకు 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా మళ్లీ కోలుకోలేకపోయింది. ఫలితంగా తొలి వార్మప్ పోరులో న్యూజిలాండ్ చేతిలో 6 వికెట్లతో పరాజయం... కనీసం 300 పరుగులు నమోదవుతాయని భావించిన మైదానంలో చివరకు కోహ్లి సేన 179 పరుగులకే పరిమితం కావడం ఆశ్చర్యకరం.
లండన్: ప్రపంచ కప్‌కు ముందు సన్నాహక సమరాన్ని భారత్ పరాజయంతో ప్రారంభించింది. శనివారం ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 39.2 ఓవర్లలోనే 179 పరుగులకు ఆలౌటైంది. పది ఓవర్ల ముందే జట్టు ఇన్నింగ్స్ ముగియడం విశేషం. రవీంద్ర జడేజా (50 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
హార్దిక్ పాండ్యా (37 బంతుల్లో 30; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ట్రెంట్ బౌల్ట్ (4/33) ప్రత్యర్థిని కుప్పకూల్చగా, నీషమ్ (3/26) రాణించాడు. అనంతరం న్యూజిలాండ్ 37.1 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రాస్ టేలర్ (75 బంతుల్లో 71; 8 ఫోర్లు), విలియమ్సన్ (87 బంతుల్లో 67; 6 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 114 పరు గులు జోడించి జట్టును గెలిపించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా (4–2–2–1) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు.
ఓపెనర్లు విఫలం...
బౌల్ట్ తన తొలి మూడు ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టి భారత్‌ను దెబ్బ తీశాడు. అతను వేసిన తొలి బంతిని ఆడలేకపోయిన రోహిత్ శర్మ (6 బంతుల్లో 2) రెండో బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ ఎల్బీ నిర్ణయంపై రోహిత్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. బౌల్ట్ తర్వాతి ఓవర్లో లోపలికి దూసుకొచ్చిన బంతిని ఆడలేక శిఖర్ ధావన్ (7 బంతుల్లో 2) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. విజయ్ శంకర్, కేదార్ జాదవ్ గాయాలతో బాధపడుతుండటంతో నాలుగో స్థానంలో సత్తా చాటేందుకు మంచి అవకాశం లభించిన కేఎల్ రాహుల్ (10 బంతుల్లో 6) దానిని వాడుకోలేకపోయాడు. బౌల్ట్ బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా పంపబోయి రాహుల్ వికెట్లపైకి ఆడుకున్నాడు.
బౌల్డ్ అయిన తర్వాత బంతిని తన కాలితో బలంగా తన్నడం అతనిలోని అసహనాన్ని చూపించింది! కొన్ని చక్కటి షాట్లు ఆడిన విరాట్ కోహ్లి (24 బంతుల్లో 18; 3 ఫోర్లు) గ్రాండ్‌హోమ్ వేసిన బంతికి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో హార్దిక్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అద్భుత బంతితో హార్దిక్‌ను ఔట్ చేసిన నీషమ్...అదే ఓవర్లో దినేశ్ కార్తీక్ (3 బంతుల్లో 4)ను పెవిలియన్ చేర్చాడు. క్రీజ్‌లో తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఎమ్మెస్ ధోని (42 బంతుల్లో 17; 1 ఫోర్)ని సౌతీ దెబ్బ తీయగా... భువనేశ్వర్ (17 బంతుల్లో 1) నిలవలేదు. స్కోరు 115/8గా ఉన్న ఈ దశలో కుల్దీప్ యాదవ్ (36 బంతుల్లో 19; 2 ఫోర్లు) తొమ్మిదో వికెట్‌కు 62 పరుగులు జత చేశారు.
ఛేదనలో కివీస్ 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. బుమ్రా అద్భుత బంతితో మున్రో (3 బంతుల్లో 4)ను ఎల్బీగా ఔట్ చేయగా... మార్టిన్ గప్టిల్ (28 బంతుల్లో 22; 3 ఫోర్లు) వేగంగా ఆడబోయి వెనుదిరిగాడు. టేలర్, విలియమ్సన్ భాగస్వామ్యం న్యూజిలాండ్‌ను గెలిపించింది. 3, 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద టేలర్ ఇచ్చిన క్యాచ్‌లను చహల్, కార్తీక్ వదిలేయగా... 55 పరుగుల వద్ద సునాయాస రనౌట్ అవకాశాన్ని పాండ్యా చేజార్చాడు. ముగ్గురు ప్రధాన పేసర్లతో పాటు పాండ్యాతో నాలుగే ఓవర్ల చొప్పున బౌలింగ్ చేయించి భారత్ సాధ్యమైనంత శ్రమ తగ్గించే ప్రయత్నం చేసింది. భారత్ తదుపరి ప్రాక్టీస్ మ్యాచ్‌లో మంగళవారం బంగ్లాదేశ్‌తో ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment