ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: ప్రవీణ్‌ కుమార్‌ | Praveen Kumar Says He Wanted Shoot Himself when Depression | Sakshi
Sakshi News home page

గన్‌తో కాల్చుకుందామనుకున్నా: ప్రవీణ్‌ కుమార్‌

Published Sun, Jan 19 2020 3:34 PM | Last Updated on Sun, Jan 19 2020 3:34 PM

Praveen Kumar Says He Wanted Shoot Himself when Depression - Sakshi

ఇవన్నీ ఏమిటీ? ఇక జీవితాన్ని ముగిద్దాం

డిప్రెషన్‌ కారణంగా కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు టీమిండియా మాజీ బౌలర్‌ ప్రవీణ్‌కుమార్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. హరిద్వార్‌ హైవేపై తన లైసెన్డ్స్‌ రివాల్వర్‌తో షూట్‌ చేసుకుందామనుకున్నానని, అయితే చిరునవ్వుతో ఉన్న తన పిల్లల ఫోటో చూశాక ధైర్యం రాలేదన్నాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్‌ ఈ సంచలన విషయాలను బయటపెట్టాడు. టీమిండియాలో చోటు కోల్పోవడంతో పాటు ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ ముగియడం వంటి కారణాలతో తాను పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఇవన్నీ ఏమిటీ? ఇక జీవితాన్ని ముగిద్దాం అనుకున్నట్లు పేర్కొన్నాడు. 

‘కెరీర్‌ ఆరంభంలో నన్ను అందరూ మెచ్చుకున్నారు. అదేవిధంగా ఇంగ్లండ్‌ సిరీస్‌ అనంతరం టెస్టు క్రికెట్‌పై నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ​ అనూహ్యంగా నన్ను జట్టు నుంచి తప్పించారు. మళ్లీ అవకాశాలు ఇవ్వలేదు. అంతేకాకుండా ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ ముగిసిపోవడంతో పూర్తిగా నిరాశ చెందాను. డిప్రెషన్‌తో నరకం చూశాను. అయితే డిప్రెషన్‌ను భారత్‌లో ఎవరూ అర్థం చేసుకోరని ఎవరికీ చెప్పలేదు. దీంతో ఇవన్నీ ఏంటి? ఇక జీవితాన్ని ముగిద్దాం? అనుకొని మీరట్‌ నుంచి హరిద్వార్‌కు నా లైసెన్డ్స్‌ రివాల్వర్‌తో బయలుదేరాను. జాతీయ రహదారిపై కారును పక్కకు ఆపి గన్‌తో షూట్‌ చేసుకుందామనుకున్నా. కానీ నవ్వుతున్న నా పిల్లల ఫోటో చూశాక మనసు రాలేదు. ఎందుకంటే నేను చనిపోతే వారు అనాథలవుతారు. నా కారణంగా అమాయకులైన వారు రోడ్డుపై పడతారు. ఇవన్నీ ఆలోచించి నా నిర్ణయం మార్చుకున్నా. ఇప్పుడంతా కూల్‌. బాగానే ఉన్నాను. ప్రస్తుతం క్రికెట్‌ కోచింగ్‌ వైపు అడుగులు వేస్తున్నా’అని ప్రవీణ్‌ కుమార్‌ వివరించాడు.   

కాగా, ప్రవీణ్‌ 2007 నవంబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. మార్చి 30, 2012లో దక్షిణాఫ్రికాపై తన చివరి మ్యాచ్ ఆడాడు. టీమిండియా తరుపున ఓవరాల్‌గా 6 టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి112 వికెట్లు తీశాడు. 2018 అక్టోబర్‌లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. నిజానికి 2012 మార్చిలోనే ప్రవీణ్ టీమిండియా చోటు కోల్పోయాడు. ఇక టీమిండియాలో అవకాశం లభించే చాన్స్ లేకపోవడంతో తను రిటైర్మెంట్ తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

చదవండి: 
నాపై వారే చేయి చేసుకున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement