హుస్సేన్ సాగర్‌లో రెగెట్టా పోటీల దృశ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లలో పెద్ద టోర్నీగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్ర రెగెట్టా చాంపియన్‌షిప్ తొలిరోజు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. హుస్సేన్‌సాగర్ జలాల్లో మంగళవారం ప్రారంభమైన ఈ చాంపియన్‌షిప్ తొలిరోజు పోటీల్లో అమ్మాయిల హవా కొనసాగింది. హైదరాబాద్‌కు చెందిన భారత నం.3 సెయిలర్ ప్రీతి కొంగర తన ప్రతిభను ప్రదర్శిస్తూ తొలిరోజు పోటీల్లో విజేతగా నిలిచింది. హైదరాబాద్ యాట్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మూడు రేసుల్లో ప్రీతి రాణించింది. రెండు రేసుల్ని అగ్రస్థానంతో ముగించిన ఆమె మూడో రేసులో రెండో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా 4 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ఎల్. ధరణి 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా... 22 పాయింట్లతో ఎల్. ఝాన్సీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. వీరికి పోటీనిచ్చిన మరో సెయిలర్ లక్ష్మీ నూకరత్నం చివరకు 17వ స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. తొలి రెండు రేసుల్లో ఒక విజయం, మరోదాంట్లో మూడోస్థానంలో నిలిచిన లక్ష్మి.. మూడో రేసును నిర్ణీత సమయం కన్నా ముందే ప్రారంభించి అనర్హతకు గురైంది. దీంతో ఆమె 17వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వికారాబాద్‌కు చెందిన అజయ్ 30 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా.. సంతోష్ (34 పాయింట్లు) అతని తర్వాతి స్థానంలో ఉన్నాడు. తెలంగాణ సెయిలింగ్ సంఘం (టీఎస్‌ఏ), భారత యాటింగ్ సంఘం, హైదరాబాద్ యాట్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన 60 మంది సెయిలర్లు తలపడ్డారు. నాలుగు రోజుల పాటు ఈ పోటీలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment