న్యూఢిల్లీ: ఆంధ్ర రంజీ ఆటగాడు గాదె హనుమ విహారి నిలకడైన ప్రదర్శనకు చక్కటి గుర్తింపు లభించింది. ఇంగ్లండ్‌తో జరుగనున్న చివరి రెండు టెస్టులకు బుధవారం ప్రకటించిన భారత జట్టులో అతనికి చోటు దక్కింది. విహారితో పాటు ముంబై యువ సంచలనం పృథ్వీ షాకూ జాతీయ జట్టులోకి పిలుపొచ్చింది. ఓపెనర్ మురళీ విజయ్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లపై వేటు వేసి వీరిద్దరిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ ఇద్దరు మినహా... ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లందరినీ కొనసాగించారు.
అతడి ప్రతిభకు గుర్తింపు...
తెలుగు రాష్ట్రాల నుంచి టీమిండియా తలుపుతట్టే స్థాయి ఉన్న ఆటగాడిగా 24 ఏళ్ల విహారి పేరు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. 2012 అండర్–19 ప్రపంచకప్ జట్టు సభ్యుడైన అతడు మధ్యలో కొంతకాలం అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ, వెంటనే పుంజుకొని రంజీల్లో అదరగొట్టడం ప్రారంభించాడు. గతేడాది ‘ట్రిపుల్ సెంచరీ’ సైతం కొట్టాడు. ఇటీవల ఇంగ్లండ్‌లో భారత ‘ఎ’ జట్టు తరఫున వెస్టిండీస్ ‘ఎ’ జట్టుపై, తాజాగా స్వదేశంలో దక్షిణాఫ్రికా ‘ఎ’పై శతకాలు (147, 148) సాధించాడు. అంతేకాక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ బ్యాట్స్‌మెన్‌కూ సాధ్యం కానంత అత్యధిక సగటు (59.45) అతడిది. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, మేటి బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారాల సగటు సైతం 53 నుంచి 55 శాతమే కావడం గమనార్హం. టెస్టులకు సరిగ్గా సరిపోయే సాంకేతికత విహారి సొంతం. డిఫెన్స్‌లోనూ మేటి. ఐపీఎల్‌లో 2015 తర్వాత ఆడే అవకాశం రాకపోవడంతో ఈ సమయాన్ని ఇంగ్లండ్‌లో ఫస్ట్ డివిజన్ లీగ్ ఆడేందుకు ఉపయోగించుకున్నాడు. అక్కడ ఆరు శతకాలు కొట్టాడు. విహారి... 2017–18 సీజన్‌లో 94 సగటుతో 752 పరుగులు చేశాడు. ఇందులో కెరీర్ ఉత్తమ స్కోరు 302 ఉండటం విశేషం. దీంతోపాటు రంజీ చాంపియన్ విదర్భతో జరిగిన ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌లో వీరోచిత 183 పరుగుల శతకం విహారిని మరింత వెలుగులోకి తెచ్చింది. తర్వాత నుంచి అతడి ఫామ్ అదే స్థాయిలో కొనసాగి... టీమిండియా గడప తొక్కేవరకు తెచ్చింది. 1999లో ఎమ్మె స్కే ప్రసాద్ తర్వాత ఓ ఆంధ్ర క్రికెటర్‌కు జాతీయ టెస్టు జట్టులో స్థానం లభించడం ఇదే ప్రథమం.
భారత టెస్టు జట్టులో విహారి
Published Thu, Aug 23 2018 12:52 AM | Last Updated on Thu, Aug 23 2018 12:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment