టీమిండియా ఓపెనర్ల రేస్‌ మళ్లీ షురూ..! | Prithvi Shaw In Team India Opener's Race With Double Hundred | Sakshi
Sakshi News home page

టీమిండియా ఓపెనర్ల రేస్‌ మళ్లీ షురూ..!

Published Thu, Dec 12 2019 4:58 PM | Last Updated on Thu, Dec 12 2019 4:58 PM

Prithvi Shaw In Team India Opener's Race With Double Hundred - Sakshi

వడోదరా: భారత క్రికెట్‌లో ఓపెనర్ల రేసు మళ్లీ షురూ కావడం ఖాయంగా కనబడుతోంది. ఇప్పటికే టెస్టు ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ తమ స్థానాల్ని పదిలం చేసుకున్నప్పటికీ, వన్డేల్లో రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌లు దాన్ని భర్తీ చేస్తున్నారు.  కాగా, ఆ రేసులో తాను ఉన్నానంటూ ముంబై ఓపెనర్‌ పృథ్వీ షా మరోసారి టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు హెచ్చరికలు పంపాడు. ఏకంగా డబుల్‌ సెంచరీ సాధించి మరీ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి పరీక్ష పెట్టాడు. తాజాగా బరోడాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో భాగంగా ముంబై తరఫున ఓపెనర్‌గా దిగిన పృథ్వీ షా రెండో ఇన్నింగ్స్‌లో 179 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లతో 202 పరుగులు సాధించాడు. ఫలితంగా రంజీ ట్రోఫీ చరిత్రలో వేగవంతంగా డబుల్‌ సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు ఈ ట్రోఫీలో రవిశాస్త్రి(123 బంతుల్లో), రాజేశ్‌ బరోహ్‌(156 బంతుల్లో) వేగవంతంగా డబుల్‌ సెంచరీ చేసిన ఆటగాళ్లు.

ఇప్పుడు ఆ తర్వాత స్థానాన్ని పృథ్వీ షా ఆక్రమించాడు. మరొకవైపు ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 66 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఇక కేవలం 174 బంతుల్లోనే 200 పరుగుల మైలురాయిని అందుకున్న పృథ్వీ షా..  దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ 2015లో శ్రేయస్‌ అయ్యర్ 175 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన రికార్డును పృథ్వీ షా బ్రేక్‌ చేశాడు. ఇక ఈ జాబితాలో రోహిత్ శర్మ.. 2009లో 185 బంతుల్లో డబుల్ సెంచరీ, సచిన్ టెండూల్కర్.. 1998లో 188 బంతుల్లో 200 పరుగులతో ఉన్నారు. మొత్తంగా.. గడిచిన రెండు దశాబ్దాలలో ముంబై జట్టు తరఫున వేగంగా డబుల్ సెంచరీ బాదిన క్రికెటర్‌గా పృథ్వీ షా నిలిచాడు.

దాదాపు ఎనిమిది నెలలు నిషేధం ఎదుర్కొని గత నెల్లో పునరాగమనం చేసిన పృథ్వీ షా.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆకట్టుకున్న పృథ్వీ షా అదే జోష్‌ను రంజీ ట్రోఫీలో కూడా కొనసాగిస్తున్నాడు. భారత జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం గట్టి పోటీ నడుస్తోంది. రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఓపెనర్‌గా కొనసాగుతుండగా.. అతనికి సరైన జోడీ కోసం టీమిండియా అన్వేషిస్తోంది. ఇటీవల టెస్టుల్లో మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా నిలకడగా రాణిస్తున్నాడు.

కానీ వన్డే, టీ20ల్లో మాత్రం ఇంకా భారత్‌కి నిరీక్షణ తప్పలేదు. శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లతో టీమిండియా నెట్టుకొస్తోంది. వెస్టిండీస్‌తో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న వన్డే సిరీస్‌ కోసం శిఖర్‌ ధావన్ స్థానంలో మయాంక్‌కి సెలక్టర్లు తాజాగా ఛాన్స్ ఇవ్వగా.. ఇప్పుడు డబుల్ సెంచరీతో రేసులోకి పృథ్వీ షా కూడా వచ్చాడు. భారత జట్టులో గత ఏడాది అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. ఆడిన తొలి టెస్టులోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ.. ఈ ఏడాది డోపింగ్ టెస్టులో ఫెయిలైన అతనిపై బీసీసీఐ 8 నెలలు నిషేధం విధించగా.. గత నెల చివర్లో అతను మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తాజాగా డబుల్ సెంచరీతో  తనను కూడా పరిశీలించాలనే సంకేతాలు పంపాడు. ఈ మ్యాచ్‌లో ముంబూ 309 పరుగుల తేడాతో గెలిచింది. ముంబై తన తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకు ఆలౌట్‌ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 409/4 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. ఇక బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌట్‌ కాగా,  రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటై ఘోర ఓటమి పాలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement