‘ప్రొఫెషనల్’గా దివాకర్, మదన్
న్యూఢిల్లీ: ఒలింపియన్ దివాకర్ ప్రసాద్, జాతీయ మాజీ చాంపియన్ మదన్‌లాల్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగు పెట్టనున్నారు. ఈ అమెచ్యూర్ బాక్సర్లు మంగళవారం ఐఓఎస్ బాక్సింగ్ ప్రమోషన్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దివాకర్, మదన్‌తో పాటు మరో 11 మంది కూడా ఐఓఎస్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికే విజేందర్, అఖిల్ కుమార్ వంటి వారిని ఈ సంస్థ ప్రమోట్ చేస్తోంది. ప్రొఫెషనల్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యులైన కామన్‌వెల్త్‌గేమ్స్ మెడలిస్ట్ అమన్‌దీప్ సింగ్, నీరజ్ గోయత్ వంటి ఆటగాళ్లు కూడా ఈ సంస్థతో కొత్తగా ఒప్పందం చేసుకున్నారు.
‘ఇప్పుడు మాతో 16 మంది బాక్సర్లు ఉన్నారు. వీరందరికీ గుర్గావ్‌లోని మా అకాడమీలో శిక్షణ ఇస్తాం’ అని ఐఓఎస్ డైరెక్టర్ గౌరవ్ తోమర్ తెలిపారు. ‘ఐదేళ్ల కింద భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు అంతగా గుర్తింపు లేదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అందుకే ప్రొఫెషనల్‌గా మారాలని నిర్ణయం తీసుకున్నాను’ అని 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన జార్ఖండ్ బాక్సర్ దివాకర్ ప్రసాద్ తెలిపాడు.