పుణే పిచ్ వివాదం: ఐసీసీ ఏమంటోంది!
న్యూఢిల్లీ: ఇటీవల ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన పుణే టెస్టుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది. కేవలం మూడు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ముగియడం వివాదాస్పద అంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ టెస్ట్ జరిగిన మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(ఎంసీఏ) పిచ్‌ను చాలా 'పూర్' అంటూ ఐసీసీ మంగళవారం వ్యాఖ్యానించింది. దీనిపై 14 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని బీసీసీఐని ఐసీసీ ఆదేశించింది. ఆసీస్, భారత్ మధ్య జరిగిన ఈ టెస్టుకు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ ఈ విషయాలను వెల్లడించాడు.
ఐసీసీ జనరల్ మేనేజర్ క్రికెట్, జెఫ్ అల్లార్డిస్, ఎమిరైట్స్ ఎలైట్ ప్యానెల్ నుంచి రంజన్ మదుగులేలు బీసీసీఐ నివేదికను సమీక్షించనున్నారు. క్లాజ్-3 ప్రకారం ఎంసీఏ పిచ్ నాణ్యతపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నట్లు క్రిస్ బ్రాడ్ తెలిపాడు. భారత్‌లో పిచ్ లపై ఇలాంటి విమర్శలు, ఆరోపణలు ఇదే ప్రథమం కాదన్నాడు. 2015, డిసెంబర్ లో దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టు పిచ్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే ఆ మ్యాచ్ ముగిసింది. సఫారీలపై 124 పరుగులతో భారత్ నెగ్గిన విషయం తెలసిందే. పుణేలో ఆసీస్‌ను ఓడించి దెబ్బతీయాలని భావించి రూపొందించిన పిచ్‌పై బంతి విపరీతంగా టర్న్ అయింది. ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ రికార్డు స్థాయిలో 12 వికెట్లు తీసి భారత్ ఓటమిని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లోనైతే భారత్ తన చివరి ఏడు వికెట్లను 11 పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం.