గువాహటి: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన ఆమె గురువారం రెండు అలవోక విజయాలు సాధించింది. ఆలస్యంగా మ్యాచ్ ఆడిన సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ సెమీస్ చేరగా.. సౌరభ్ వర్మ క్వార్టర్స్ పోరుకు అర్హత సంపాదించారు. పురుషుల డబుల్స్‌లో ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్, చిరాగ్ శెట్టి–ప్రణవ్ చోప్రా జోడీలు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి.
మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఒలింపిక్స్ రజత విజేత సింధు 21–11, 21–13తో నాగ్‌పూర్ షట్లర్ మాల్విక బన్సోడ్‌పై సునాయాస విజయం సాధించింది. నేపాల్‌లో జరిగిన దక్షిణాసియా అండర్–21 చాంపియన్ అయిన మాల్విక... సింధు ధాటికి నిలువలేకపోయింది. తెలుగుతేజం వరుస సెట్లలో ‘ఖేలో ఇండియా’ గేమ్స్ రన్నరప్ మాల్వికను 35 నిమిషాల్లో ఇంటిదారి పట్టించింది. అనంతరం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–16, 21–7తో రియా ముఖర్జీపై గెలిచింది. సెమీఫైనల్లో ఆమె... నాలుగో సీడ్ అష్మిత చాలిహతో తలపడుతుంది. ప్రిక్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్ 21–11, 21–10తో శ్రుతిపై గెలిచింది. నేడు జరిగే క్వార్టర్స్‌లో నేహా పండిట్‌తో సైనా తలపడుతుంది. మరో తెలుగమ్మాయి సాయి ఉత్తేజితరావుకు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. ఆమె 13–21, 15–21తో వైష్ణవి చేతిలో పరాజయం చవిచూసింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ జంట 21–11, 18–21, 21–12తో షేనన్–రియా గజ్జార్ ద్వయంపై గెలిచింది.
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్‌సీడ్ సమీర్ వర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆర్యమన్ టాండన్‌తో జరిగిన పోరులో 21–16తో ఒక గేమ్ గెలిచిన సమీర్... రెండో గేమ్‌లో 1–8 స్కోరు వద్ద గాయంతో నిష్క్రమించాడు. భమిడిపాటి సాయిప్రణీత్ 21–10, 21–10తో రోహిత్ యాదవ్‌పై, కశ్యప్ 20–22, 21–17, 21–17తో రాహుల్ యాదవ్‌పై, సౌరభ్ వర్మ 21–8, 21–15తో కార్తీక్ జిందాల్‌పై గెలుపొందారు. లక్ష్యసేన్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్స్‌లో అతను 21–11, 21–8తో అన్సల్ యాదవ్‌పై నెగ్గాడు. క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21–14, 21–10తో ఆర్యమన్‌పై గెలుపొందగా, కౌçశల్ 21–11, 21–19తో హర్షిల్ డానీని ఓడించాడు. పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్ అర్జున్–శ్లోక్ రాంచంద్రన్ జోడీ 21–11, 21–18తో రోహన్ కపూర్–సౌరభ్ శర్మ ద్వయంపై, చిరాగ్ శెట్టి–ప్రణవ్ చోప్రా జంట 21–8, 18–21, 22–20తో రూపేశ్ కుమార్– వి.దిజు జోడీపై గెలుపొందాయి.
సింధు అలవోకగా...
Published Fri, Feb 15 2019 12:30 AM | Last Updated on Fri, Feb 15 2019 12:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment